తోడు, చేయూత యూనిట్లు ప్రారంభం కావాలి..


Ens Balu
2
Srikakulam
2021-03-19 19:26:23

శ్రీకాకుళంజిల్లాలో  జగనన్న తోడు, చేయూత యూనిట్లు సకాలంలో ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ప్రతి శుక్రవారం నాటికి ప్రగతి నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు. జగనన్న తోడు, చేయూత పథకాలపై పశుసంవర్ధక శాఖ, బ్యాంకర్లు, డీఆర్డీఏ తదితర శాఖలతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. చేయూత క్రింద పశుసంపద యూనిట్లు జిల్లాకు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. జగనన్న చేయూత క్రింద పాడిపశువుల యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాను ఆముల్ తో అనుసంధానం చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే వంద గ్రామాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి రోజు కనీసం మూడు యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. బ్యాంకులకు రుణాల మంజూరుకు దరఖాస్తులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సంతబొమ్మాలి, కంచిలి వంటి ప్రాంతాల్లో ఎపిజీవిబి శాఖలు స్పందించడం లేదని డీఆర్డీఏ సిబ్బంది తెలియజేయగా వెంటనే రీజనల్ మేనేజర్ దృష్టిలో పెట్టాలని ఆయన సూచించారు. యూనిట్ల ఏర్పాటులో పశుసంవర్ధక శాఖ ఎడిలు, వెలుగు ఏసిలు శ్రద్ద వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని వెంటనే చెల్లించుటకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. జగనన్న తోడు క్రింద ప్రభుత్వ లక్ష్యం పూర్తి చేయాలని కోరారు. బ్యాంకుల నుండి మంచి సహకారం లభిస్తుందన్నారు. చనిపోయిన దాదాపు వెయ్యి మందికి బీమా క్లెయిమ్ లు పరిష్కరించాలని ఆయన అన్నారు. జగనన్న తోడు క్రింద తీసుకున్న రుణాలను తిరిగి కట్టించాలని ఆయన ఆదేశించారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. జీవనోపాధులు కల్పించుటకు ప్రభుత్వం సదుద్దేశంతో తోడు పథకం క్రింద రుణాలు మంజూరు చేస్తున్న విషయాన్ని గ్రహించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. డీఆర్డీఏ సిబ్బంది దుకాణాలను పరిశీలించి లబ్ధిదారులకు పథకం వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, డీఆర్డీఏ పిడి బి.శాంతిశ్రీ, యూనియన్ బాంక్ రీజనల్ మేనేజర్ పి.కృష్ణయ్య, ఎల్.డి.ఎం జి.వి.బి.డి.హరిప్రసాద్, ఎస్బిఐ రీజనల్ మేనేజర్ తపోధన్ దేహారి, ఎపిజివిబి ఆర్.ఎం మహమ్మద్ రియాజ్ , డిసిసిబి సిఇఓ దత్తి సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ జెడి డా.ఏ.ఈశ్వర రావు, డిడి డా.మాదిన ప్రసాదరావు, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు