టిడ్కో గ్రుహాలకు బ్యాంకర్లు సహకరించాలి..
Ens Balu
2
Visakhapatnam
2021-03-19 20:33:33
జివిఎంసీ పరిధిలో ఎ.పి. టిడ్కో వారు నిర్మిస్తున్న గృహాల నిర్మాణాలు చేపట్టడానికి లబ్దిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఋణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి .ఎస్ బ్యాంకు ప్రతినిధులను కోరారు. ఈ విషయమై జివిఎంసి శుక్రవారం, ఎ.పి.టిడ్కో మేనేజింగ్ డైరక్టరు సి.హెచ్. శ్రీధర్, ఎస్.బి.ఐ. డి.జి.ఎం. రంగారాజన్ తో కలసి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ జివిఎంసి పరిధిలో 24,192 గృహాలను నిర్మిస్తున్నామని, అందులో 22,936 గృహాలను నాన్ స్లమ్ పరిధిలోను, 1256 గృహాలు స్లమ్ ఏరియాలోనూ నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం 300 చ. అడుగుల విస్తీర్ణం గల గృహాన్ని ఒక రూపాయికే లబ్ధిదారునికి అందిస్తామని, 365చ. అడుగుల విస్తీర్ణం గల గృహాల మంజూరుకు లబ్ధిదారుని వాట రూ.25,000.00లతో పాటు బ్యాంకు ఋణం రూ.3,15,000.00లు, 430 చ. అడుగుల విస్తీర్ణం గల గృహానికి లబ్ధిదారుని వాట రూ.50,000.00లతో పాటు బ్యాంకు ఋణం రూ.3,65,000.00లు చెల్లించవలసి ఉంటుందని కమిషనర్ బ్యాంకర్లకు వివరించారు.
అనంతరం, ఎ.పి. టిడ్కో మేనేజింగ్ డైరక్టరు సి.హెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పధకానికి బ్యాంకర్లు సహాయ సహాకారాలు అందించి లబ్ధిదారులకు ఋణాలను మంజూరు చేసినచో, గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు గృహాలను అందించుటకు అవకాశం గలదని బ్యాంకర్లకు తెలిపారు. బ్యాంకు ఋణాల మంజూరుకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి బ్యాంకర్లకు సహాయ సహకారాలు అందించటానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఋణమంజూరు విషయం లో ఎటువంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని తమ దృష్టికి తీసుకువచ్చినట్లైతే, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ద్వారా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లకు హామీ ఇచ్చారు. ఇంకా, ఈ సమావేశంలో అదనపు కమిషనర్ పి. ఆషాజ్యోతి, ఎస్.బి.ఐ., డి.జి.ఎం. రంగరాజన్, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ గృహా ఋణాల మంజూరుకు తగు సూచనలు చేసారు. ఈ సమావేశంలో జివిఎంసి అందరు జోనల్ కమిషనర్లు, ఎ.పి. టిడ్కో పర్యవేక్షక ఇంజినీరు మరియు సిబ్బంది, ఎ.పి.డి.లు, సి.ఓ.లు జివిఎంసి పరిధిలో గల 40 బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.