రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడాలి...


Ens Balu
6
Srikakulam
2020-08-26 17:27:08

శ్రీకాకుళం జిల్లాలోని రైతాంగానికి ఎట్టిపరిస్థితిల్లోనూ యూరియా కొరత ఉండరాదని   జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులకు స్పష్టం చేసారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి సంబంధించి రైతులకు అవసరమైన ఎరువులు  పుష్కలంగా ఉన్నాయని, ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ, మార్కెఫెడ్ సమన్వయంతో పనిచేసి జిల్లాలోని రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ బంగ్లాలో రైతాంగానికి యూరియా, విత్తనాలు సరఫరాపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ జిల్లాలో 23,059 మెట్రిక్ టన్నుల ఎరువులు లభ్యంగా ఉన్నాయని, ఇంకా అదనంగా కావలసిన యూరియాను తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తొలుత వ్యవసాయ , మార్కెఫెడ్ శాఖల అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రోజు విడిచి రోజు యూరియా నిల్వలు రప్పిస్తున్నామని, నాలుగు మండలాలను ఒక యూనిట్ గా  విభజించి 200 మెట్రిక్ టన్నుల నిల్వలను ఆయా చోట్ల అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఎప్పటికప్పుడు ఆయా స్లాట్ అలాట్మెంట్ లను వ్యవసాయాధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారని, జిల్లాలో ఆగష్టు మాసాంతానికి 18,000 టన్నుల యూరియా అవసరం ఉందని,  ప్రస్తుతానికి 11,698 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిలో మూడు వేల టన్నులు ప్రైవేటు ట్రేడర్స్ వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ 10 వేల టన్నులే కాకుండా                    ఈ నెలాఖరుకు మరో 18 వేల టన్నులు అవసరం ఉంటుందని, అవి సరైన సమయంలోనే జిల్లాకు రానున్నట్లు తెలిపారు. యూరియా తో పాటు డిఎపి 6,400 టన్నులు, ఎంవోపి 2,133 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 3,488 టన్నులు, ఎస్ ఎస్ పి 1,659 టన్నుల నిల్వలు జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా రైతాంగం వినియోగిస్తున్న ఎరువుల అంచనా ప్రకారం దానిని పరిగణలోకి తీసుకొని లక్ష్యాన్ని నిర్ధేశించామని తెలిపారు. 7,500 మెట్రిక్ టన్నుల ఐపిఎల్ ,వెయ్యి టన్నుల స్పీక్,  వెయ్యి టన్నుల కోరమండల్ ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు గాను తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని, అక్రమంగా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కు  వివరించారు. జిల్లాలో రైతాంగానికి సక్రమంగా వాటిని పంపిణీ అయ్యేలా చూడాలని, ఏ ఒక్క రైతు నష్టపోరాదని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె. శ్రీధర్, మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ కె.యు.పి.రమణి, డి.సి.సి.బి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.సత్యనారాయణ, ఆత్మా పథక సంచాలకులు కె.కృష్ణారావు, క్వాలిటీ కంట్రోల్ ఇన్ స్పెక్టర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.