కోవిడ్ వ్యాప్తి నివారణకు సహకరించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్ అన్నారు. శ్రీకాకుళం నగర వర్తకులతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేసులు అధికంగా పెరుగుతున్నాయని అన్నారు. బుధవారం ఉదయం నివేదిక ప్రకారం 1,444 కేసులు జిల్లాలో నమోదు అయ్యాయని తెలిపారు. సెకండ్ వేవ్ మ్యుటేషన్ విభిన్నంగా ఉందని ఆయన చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఏ విధమైన చర్యలు చేపట్టాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వర్తక, వాణిజ్య రంగాలు సహకరించి కేసుల తగ్గుదలకు ప్రయత్నం చేయాలని కోరారు. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు సమయాన్ని నియంత్రించేందుకు కృషి చేయాలని అన్నారు. మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గూర్చి ఆలోచించాలని ఆర్.డి.ఓ పేర్కొన్నారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులు విధిగా మాస్కు ధరించాలని ఆయన స్పష్టం చేసారు. కోవిడ్ నిబంధనలు ప్రతి దుకాణం విధిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. నిర్దేశించిన సమయం ప్రతి రంగానికి వర్తిస్తుందని ఆయన స్పష్టం చేసారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం10.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వ్యాపార వర్గాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
డిఎస్పీ ఎం.మహేంద్ర మాట్లాడుతూ వ్యాపార వర్గాలు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరారు. అందరూ ఒకే మాటపై ఉండాలని సూచించారు. నగర పాలక సంస్థ కమీషనర్ కె.శివప్రసాద్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో వెయ్యి కేసులు నమోదయ్యాయని తెలిపారు. మార్చి 1 నుండి నగరంలో 16 వందల కేసులు నమోదు అయ్యాయని ఆయన చెప్పారు. మంగళవారం 297 కేసులు నమోదయ్యాయని చెప్పారు. జిల్లాలో ఎక్కువ కేసులు శ్రీకాకుళం నగరంలో వస్తున్నాయని ఆయన వివరించారు. ఓబిఎస్ మార్కెట్ ను 80 ఫీట్ రోడ్ లోకి మార్చడం జరిగిందని, లక్ష్మీ టాకీస్ వద్ద మార్కెట్ ను కోడి రామమూర్తి స్టేడియంలోకి మార్చడం జరిగిందని ఆయన వివరించారు. ఇతర మార్కెట్లను మార్పు చేయుటకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వ్యాపార వర్గాల ప్రతినిధులు పి.వి.రమణ, కోరాడ రమేష్, కోరాడ హరగోపాల్ మాట్లాడుతూ వ్యాపార వర్గాలు సహకరించుటకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు అవకాశం కల్పించాలని కోరారు. మార్కెట్లు విశాల ప్రాంతాల్లోకి మార్చునపుడు అచ్చట సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో పోలీసు ఇన్స్పెక్టర్ అంబేద్కర్, ఎస్.ఐ లు విజయ్ కుమార్, సిద్దార్థ కుమార్ , వ్యాపార వర్గాలు తదితరులు పాల్గొన్నారు.