చికిత్సతోపాటు కౌన్సిలింగ్ కూడా..


Ens Balu
5
విశాఖపట్నం
2021-04-25 13:36:13

 కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి చికిత్సతో పాటు ప్రతిరోజూ కౌన్సిలింగ్ ఇవ్వాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు.  ఆదివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నోడల్ అధికారులు, వైద్యాధికారులతో జిల్లాలో కరోనా పరీక్షలు, చికిత్సలను గూర్చి క్షుణ్ణంగా సమీక్షించారు.  కరోనా పరీక్షలు మరింత ఎక్కువగా చేయాలన్నారు.  కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ఫోన్ చేసి తెలియజేయాలని, వారి ఆరోగ్య పరిస్థతిని గూర్చి తెలుసుకోవాలన్నారు.  వారి పరిస్థితిని బట్టి వెంటనే కంటంన్మెంట్ మేనేజ్ మెంట్ అధికారులకు, వైద్యాధికారులకు ఫోన్ చేసి వారిని కోవిడ్ కేర్ సెంటర్ ఆసుపత్రికి తరలించాలన్నారు.  పాజిటివ్ వచ్చిన వారి వివరాలను విశాఖ నగరానికి సంబంధించి జివియంసి కమిషనర్ జి.సృజన, డాక్టర్ దేవీ మాధవి, రూరల్ జిల్లాకు సబంధిరి జిల్లా పరిషత్ సిఈవో నాగార్జున సాగర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలన్నారు.   ఐటిడిఎ పి.వో., సబ్ కలెక్టరు, ఆర్డీవోలు,  జోనల్ కమిషనర్లు, ఎంపిడివోల సహాయంతో వారిని దగ్గరలో నున్న కోవిడ్ కేర్ సెంటర్, పిహెచ్ సి, సిహెచ్ సి, యుహెచ్ సి లలో చేర్పించాలన్నారు. ఇంటిలో ఐసొలేషన్ లో వున్న వారికి  ప్రతి రోజూ ఫోన్ ద్వారా వారి పరిస్థతిని తెలుసుకోవాలని, వారిలో మనోధైర్యం నింపాలన్నారు. రోగుల కాంటాక్ట్ వ్యక్తులకు పరీక్షలు నిర్వహణ బాధ్యతలను గ్రామ, వార్డు సెక్రటరీలు చూసుకోవాలన్నారు.  

ఆక్సిజన్ లభ్యతను ప్రతిరోజూ తెలియజేయాలి
ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరతరాకూడదని, అవసరాలకు మించి ఆక్సిజన్ నిల్వ వుండేలా చర్యలు తీసుకోవాలని ఎపిఎమ్ఐడిసి ఈ.ఈ.  నాయడును ఆదేశించారు.  అవసరమయ్యే ఆక్సిజన్, సంబంధిత పరికరాల కొరత వుండకూడదని, అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్దం చేయాలన్నారు. 
ఎంపానెల్డ్  ఆసుపత్రులను తనిఖీ చేయాలి
నగరంలో గల ఎంపానెల్డ్ ఆసుపత్రులను వెంటనే తనిఖీచేసి వాటి సంసిద్దత, సేవల తీరుపై నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ లను కలెక్టరు ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో ఏయే సేవలు అందస్తున్నారు. ఆసుపత్రులలో చికిత్సా విధానం, పడకల సదుపాయాలు, మొదలైన వివరాలతో నివేదికను పంపించాలని ఆదేశించారు. 
ఈ సమావేశంలో జివియంసి కమిషనర్ జి.సృజన, జాయింట్ కలెక్టరు పి.అరుణ్ బాబు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, జెడ్.పి. సిఈవో నాగార్జున సాగర్, పిడి డిఆర్ డిఎ విశ్వేశ్వరరావు, డిఎంఅండ్ హెచ్ వో డాక్టర్ సూర్యనారాయణ, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్లు డాక్టర్ భాస్కర్, డాక్టర్ రాజేష్, డాక్టర్ దేవీమాధవీ , డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ ఉమావతి తదితరులు పాల్గొన్నారు.