ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ రేషన్ సరుకుల కోసం వినియోగిస్తున్న మినీ వ్యాన్ లను తాత్కాలిక అంబులెన్సులుగా మార్చి అత్యవసర కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడాలని సామాజికవేత్త, ప్రముఖ న్యాయవాది రహిమున్నీసాబేగమ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసులు అధికంగా మారుతున్న వేళ రేషన్ సరఫరా చేసే మినీ వ్యాన్లను అంబులెన్సులుగా మార్చడం ద్వారా సత్వరమే అత్యవసర కోవిడ్ రోగులను ఆసుపత్రులకు తరలించడానికి అవకాశం వుంటుందన్నారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో ప్రతీ పడకకి ఒక ఆక్సిజన్ సిలెండర్ కిట్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ రేషన్ సరుకులు ఇచ్చే సమయంలో ప్రజలంతా గుమిగూడకుండా చూడాలన్నారు. రోజుకి కొద్ది మందికి మాత్రమే సరుకులు ఇచ్చేవిధంగా వాలంటీర్ల ద్వారా సేవలు అందించాలన్నారు. మినీ వ్యాన్లను తాత్కాలిక అంబులెన్సులుగా ఏర్పాటు చేయడం ద్వారా సత్వరమే కోవిడ్ రోగులకు వైద్య సహాయం కోసం ఆసుపత్రులకు తరలించే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ విషమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సత్వరమే నిర్ణయం తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమె కోరారు.