విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకూడదు..
Ens Balu
1
singanamala
2021-04-29 12:15:07
కోవిడ్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేయాలని లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ యాజమాన్యాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం శింగనమల మండలంలోని చక్రాయపేట గ్రామ పరిధిలోని లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్ అత్యవసరంగా మారిందని, జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఇందులో భాగంగానే లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ సేవలు ఉపయోగించుకుం టున్నామన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ లో ప్రతి రోజూ ఎంత కెపాసిటీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది, ఎన్ని సిలిండర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తారు, ఇక్కడినుంచి ఎక్కడెక్కడకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు, తదితర అన్ని రకాల వివరాలను జిల్లా కలెక్టర్ యాజమాన్య ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ లో ఆక్సిజన్ ఉత్పత్తికి ఎలాంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారు అని పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు 7 - 8 క్యూబిక్ కేజీల సామర్థ్యం గల 350 సిలిండర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తున్నామని, తాడిపత్రి పరిధిలోని పరిశ్రమల అవసరాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కు యాజమాన్యం సభ్యులు వివరించారు. ఆక్సిజన్ ను డైరెక్ట్ గా సిలిండర్ కు ఫిల్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అక్కడ పనిచేస్తున్న వర్కర్లతో మాట్లాడి ఆక్సిజన్ ను సిలిండర్లకు ఫిల్ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ సరఫరాలో ఏ స్థాయిలో ఎటువంటి చిన్న సమస్య ఉన్నా తనకు వెంటనే సమాచారం అందించాలన్నారు.వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ ఉత్పత్తిని బాగా చేస్తున్నారని లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ యాజమాన్యాన్ని కలెక్టర్ మెచ్చుకున్నారు. లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ కు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ జగన్నాథ్ సింగ్, ఆర్డీఓ గుణభూషన్ రెడ్డి, తహసీల్దార్ విశ్వనాథ్, ఎంపీడీఓ ఉమాదేవి, పరిశ్రమల శాఖ జీఎం అజయ్ కుమార్, లైఫ్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రతినిధులు భీమ లింగారెడ్డి, జయసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.