కరోనా కట్టడికి ప్రభుత్వం విశేష కృషి..
Ens Balu
2
కాకినాడ
2021-05-01 15:31:35
తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ కట్టడికి, బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎంతో కృషిచేస్తున్నారని డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, స్పెషల్ ఆఫీసర్ జె.శ్యామలరావు, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ తదితరులతో కలిసి జిల్లాలోని కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత కలెక్టర్ మురళీధర్‌రెడ్డి.. జిల్లాలో డివిజన్ల వారీగా ప్రస్తుత పాజిటివిటీ, కోవిడ్ టెస్టింగ్, బాధితులకు వైద్య సహాయం, వ్యాక్సినేషన్; ఆక్సిజన్ నిల్వలు, వినియోగం; మేనేజ్‌మెంట్, కోవిడ్ కేర్ కేంద్రాలు, ఆసుపత్రుల నిర్వహణ, ఆసుపత్రులపై పర్యవేక్షణ, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల సరఫరా, హోం ఐసోలేషన్, క్షేత్రస్థాయి కార్యకలాపాలు తదితరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. గతేడాది తొలిదశలో ఆగస్టులో అత్యధికంగా అమలాపురం డివిజన్‌లో 26.04 శాతం పాజటివిటీ నమోదు కాగా.. రెండోవేవ్‌లో గతవారం రోజుల్లో ఈ డివిజన్‌లో 28.26 శాతంగా ఉందని తెలిపారు. గరిష్టంగా రాజమహేంద్రవరం డివిజన్‌లో 34.30 శాతం పాజిటివిటీ నమోదైనట్లు వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 76 ఆసుపత్రుల్లో 4,461 పడకలు ఉన్నాయని, వీటిలో ఐసీయూ పడకలు 788 కాగా, 2328 ఆక్సిజన్ పడకలు ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా రోజువారీ ఆక్సిజన్ సామర్థ్యం 74 కిలో లీటర్లు కాగా, వినియోగం 45 కిలో లీటర్లుగా ఉందన్నారు. బాధితుల అవసరాల మేరకు ఆక్సిజన్‌కు కొరత లేకుండా పటిష్ట కార్యాచరణ రూపొందించి అమలుచేస్తున్నామని, ఆసుపత్రులు ఇచ్చే ఇండెంట్ ప్రకారం రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ కోసం కమాండ్ కంట్రోల్ రూంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి కోవిడ్ ఆసుపత్రికి నోడల్ అధికారిని నియమించామన్నారు. గ్రామ, మునిసిపల్ ప్రాంతాల స్థాయిలో కోవిడ్ కట్టడికి ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశామని, వీటికి 21 రోజుల పటిష్ట కార్యాచరణపై అవగాహన కల్పించామని తెలిపారు. రోజుకు సగటున 4,060 పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్లను వైద్య సలహాలు అందించడంతో పాటు సైకలాజికల్ హెల్ప్‌లైన్ ద్వారా సేవలందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.