ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని సామాజికవేత్త, ప్రముఖ న్యాయవాది రహిమున్నీసాబేగమ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసులు అధికంగా మారుతున్న వేళ విద్యార్ధుల పరీక్షలను రద్దు చేయాలని, కుదరకపోతే వాయిదా వేయాలన్నారు. ప్రస్తుతం రోజుకు వేలల్లో కేసులు, పదుల సంఖ్యలో మరణాలు పెరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. విశాఖలో సాధారణ ప్రజలతోపాటు చిన్నపిల్లలు కూడా కరోనా వైరస్ భారిన పడి మ్రుత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం ప్రభుత్వం. ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయడం ద్వారా విద్యార్ధులు మరింతగా పరీక్షలకు సిద్ధం కావడానికి కూడా ఆస్కారం వుంటుందని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. పెద్దలను వెంటాడుతున్న కరోనా రేపు పిల్లలను కూడా పట్టి పీడిస్తుందని, ప్రభుత్వం తక్షణమే పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలన్నారు. చాలా చోట్ల ఉపాధ్యాయులు కూడా ఈ కరోనా భారిన పడి మరణిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సత్వరమే నిర్ణయం వెనక్కి తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమె కోరారు.