తూ.గో.జిల్లాలో ఆలయాలన్నీ పూర్తిగా మూత..
Ens Balu
1
కాకినాడ
2021-05-03 14:18:54
కోవిడ్ రెండోదశలో ప్రస్తుతం 30 శాతం పాజిటివిటీ ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఉద్ధృతిని కట్టడిచేసే చర్యల్లో భాగంగా అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ ఆదేశాలు మే 3వ తేదీ సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీతో కలిసి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి వివిధ మతాల పెద్దలతో కోవిడ్ వైరస్ ఉద్ధృతి నియంత్రణ చర్యలపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలోని పరిస్థితిని వివరించడంతో పాటు బాధ్యతాయుత వ్యక్తులుగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర ప్రార్థనా స్థలాలను పూర్తిగా మూసేయాలని, భక్తులకు అనుమతి ఉండదని ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు పూర్తి కోవిడ్ జాగ్రత్తలతో పూజారి, ఇమామ్, పాస్టర్ వంటి మత పెద్దలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. జనరల్ పబ్లిక్‌కు అనుమతి ఉండదని తెలుపుతూ దేవాలయాలు, ప్రార్థనా స్థలాల ప్రవేశద్వారాల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. మతపర సంస్థలకు సంబంధించి పబ్లిక్ వేలం నిర్వహణ ప్రక్రియను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో జాతరలు, ఊరేగింపులు వంటివి నిర్వహించకూడదని స్పష్టం చేశారు. తాజా ఆదేశాలు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వర్తిస్తాయని, ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005లోని సెక్షన్ 51-60, ఐపీసీ సెక్షన్ 188తో పాటు ఇతర వర్తించే చట్టాల మేరకు కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోబడతామని వెల్లడించారు. కాకినాడ, రాజమహేంద్రవరం ఎస్‌పీలు, సంబంధిత ఇతర అధికారులు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ ఏదో ఒక వైపు నుంచి దాడిచేస్తున్న ప్రస్తుత విపత్తు సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలుచేసేందుకు సహకరించాలని కోరగా.. అందుకు మత పెద్దలు సంపూర్ణ మద్దతు ఇస్తూ అంగీకారం తెలిపారు. సమావేశంలో ఇన్‌ఛార్జ్ జేసీ (సంక్షేమం), డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, మైనారిటీ సంక్షేమ అధికారి పీఎస్ ప్రభాకరరావు, హిందూమత పెద్దలు సీహెచ్ వేణుగోపాల్, సీహెచ్ కనకదుర్గా ప్రసాద్; ముస్లిం మతపెద్ద రజాక్; క్రైస్తవ మత పెద్దలు రెవరెండ్ విలియం, రెవరెండ్ జోయల్, రెవరెండ్ మిస్పా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.