కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆసుపత్రిని రూ.100 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకలతో నిర్మాణం చేపడుతున్నట్టు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ తెలిపారు. సోమవారం సాంబమూర్తినగర్‌లో కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నరసాపురం ఎమ్మెల్యే ఎం.ప్రసాద్‌రాజుతో కలిసి ఎంపీ ఈఎస్ఐ నూతన ఆసుపత్రి నిర్మాణ పనులను పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కార్మికుల ఇబ్బందులు ఈ ఆసుపత్రి నిర్మాణంతో తొలగిపోతాయని, వైద్య సేవల కోసం రాజమహేంద్రవరం వెళ్లాల్సిన బాధ తప్పుతుందన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పరిశ్రమలు ఉన్నాయని, వీటిలో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులను కలుపుకొని దాదాపు రెండు లక్షల మంది ప్రజలకు ఈ ఆసుపత్రి ద్వారా సేవలు అందనున్నట్లు వివరించారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖా మంత్రి సురేష్‌కుమార్ గంగ్వార్ ఎంతో సహకారం అందించారని, గతేడాది ఫిభ్రవరిలో శంకుస్థాపన జరిగినప్పటికీ టెండర్ ప్రక్రియ, సాంకేతిక కారణాల వల్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని వివరించారు. ఇప్పుడు అన్నీ సిద్ధమవడంతో నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం వేసవి కాబట్టి పనులు త్వరగా జరుగుతాయని, దాదాపు 15 నెలల్లో పనులు పూర్తయ్యేలా ఇంజనీర్లు ప్రణాళికలు రూపొందించినట్లు ఎంపీ వెల్లడించారు.
కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ సహకారంతో అధునాతన
ఈఎస్ఐ ఆసుపత్రి కల సాకారమవుతోందని, ఆమె ఎంతో పట్టుదలతో కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఆసుపత్రి కోసం కృషిచేశారని పేర్కొన్నారు. కాకినాడతో పాటు జిల్లాలోని కార్మిక సోదరులందరూ ఆమెకు రుణపడి ఉంటారని, ఈ ఆసుపత్రి ద్వారా అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ ఆసుపత్రి కల సాకారమవుతుండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాటు ఎంపీ కృషి ఎంతో ఉందని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ పీడబ్ల్యూడీ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్.సాల్మన్‌రాజు, నిర్మాణ సంస్థ ఇంజనీర్ ఆంజనేయులు, సైట్ ఇంజనీర్ భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.