కోవిడ్ వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించే నిమిత్తం కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ సోమవారం చీపురుపల్లిలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. బెడ్ల కేటాయింపు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సిబ్బంది తదితర అంశాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ సరఫరాలో, బెడ్ల కేటాయింపులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. టెస్టింగ్ కిట్లు, ల్యాబ్ పరికరాలు, అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమనుకుంటే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని చెప్పారు. బొబ్బిలిలో ఆక్సిజన్ ఫిల్లింగ్ సదుపాయం కల్పించామని, అవసరమైన మేరకు అక్కడ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రి పరిసరాలలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై స్థానిక శానిటేషన్ అధికారులను మందలించారు. శానిటేషన్ ఈవోని పిలిపించి మాట్లాడారు. ఆవరణలో ఉన్న చెత్తను, ఇతర వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రిసెప్షన్ సెంటర్లో నిత్యం సిబ్బంది అందుబాటులో ఉండాలని, అలాగే కోవిడ్ వార్డు వద్ద పోలీసు సిబ్బంది 24 గంటలు సేవలందించేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
శ్రీ విజయ ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం
అనంతరం స్థానిక శ్రీ విజయ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఇప్పటి వరకు కోవిడ్ సేవలు ప్రారంభించకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులను ఎందుకు చేర్చుకోలేదని ఆసుపత్రి వైద్యులను ఆరా తీయగా.. సిబ్బంది లేరని.. రావడానికి ఎవరూ ఆశక్తి చూపటం లేదని సమాధానం ఇచ్చారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. అదనపు సిబ్బందిని నియమించుకొని 24 గంటల్లో కోవిడ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్కడున్న నోడల్ అధికారి రామకృష్ణను పిలిపించి డీసీహెచ్ఎస్‌తో మాట్లాడి రేపటికల్లా విజయ ఆసుపత్రిలో కోవిడ్ సేవలు అందేలా చూడాలని చెప్పారు.