సకాలంలో ఆసుపత్రులకు ఆక్సిజన్..
Ens Balu
2
శ్రీకాకుళం
2021-05-04 13:51:11
శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గల ఆక్సిజన్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. మంగళ వారం మధ్యాహ్నం ఆసుపత్రి ఆవరణలో ఉన్న 10 వేల లీటర్ల సామర్ధ్యం గల యూనిట్ ను పరిశీలించి నిర్వహణపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేసారు. ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని ఆయన పేర్కొన్నారు. ద్రవ రూప ఆక్సిజన్ గడ్డకట్టుటకు అవకాశాలు ఉంటాయని అటువంటి సంఘటన జరగకుండా నిరంతరం నీటితో పైపులను తడి చేస్తుండాలని ఆయన ఆదేశించారు. పైపు లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అన్నారు. ఆక్సిజన్ నిరంతర సరఫరా ఉండాలని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ యూనిట్ నిర్వహణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని కోరారు. కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించిన తక్షణం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంత త్వరగా పరీక్షలు చేయించుకుంటే అంత సురక్షితంగా ఉంటారని గ్రహించాలని ఆయన అన్నారు. త్వరగా వైరస్ నిర్ధారణ జరిగితే సంబంధిత మందులను ఇంటి వద్ద ఉంటూనే తీసుకుని నయం చేసుకోవచ్చని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆలస్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. కరోనా ఎవరికైనా రావచ్చని, కరోనా గూర్చి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరగా నిర్ధారణ, త్వరగా మందులు తీసుకోవడం, భయం లేకుండా ఉండటంతో అతి త్వరగా కోలుకోవచ్చని పేర్కొన్నారు. రద్దీ ప్రాంతాలకు వెళ్ళరాదని, వేడుకలలో పాల్గొనరాదని ఆయన హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ , ఏపిఎస్ ఎంఐడిసి జెఇ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.