విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం కొండలింగాల వలస పంచాయతీ పరిధిలోని తాడిపూడి వలసలో కొండకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 141 ప్రభుత్వ పోరంబోకు స్థలంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ జరిపించామని జిల్లా మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు బి. విజయలక్ష్మి తెలిపారు. తవ్వకాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నమాంగనీస్ ఖనిజాన్ని కొంతమంది అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని పేర్కొంటూ ఇటీవల వివిధ పత్రికలు వార్తలు ప్రచురించాయి. ఈ మేరకు ఆమె స్పందిస్తూ చర్ లకు ఉపక్రమించారు. మైనింగ్ శాఖ అధికారులు, సిబ్బంది సంబంధిత ప్రాంతంలో పర్యటించి విచారించారని, గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా తవ్వి ఉంచిన మాంగనీస్ ఖనిజ నిల్వలను గుర్తించారని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడున్న స్థానికులను, కూలీలను విచారించగా కొంతమంది జేసీబీ సహాయంతో తవ్వకాలు జరుపుతున్నారని తేలిందన్నారు. రోడ్డు రవాణా శాఖ అధికారుల సహాయంతో జేసీబీని, దాని యజమాని వివరాలు సేకరించామని తెలిపారు. అక్కడున్న ఖనిజ నిల్వలను భద్రతపరంగా స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించామని చెప్పారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు పేర్కొన్నారు.