కరోనా నేపథ్యంలో తాడిపత్రి సమీపంలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో అతిపెద్ద ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం తాడిపత్రి సమీపంలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో ప్రతి రోజు ఎంత కెపాసిటీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది అనే వివరాలను అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ డైరెక్టర్ జయప్రకాష్ దేవరాజ్, ఐనొక్స్ గ్యాస్ ప్లాంట్ ఇంచార్జి శివప్రసాద్ ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో ప్రతిరోజు 90 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని వారు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఎక్కడెక్కడ ఏ ఏ విభాగాలను ఏర్పాటు చేశారు, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడవుంది, ఖాళీ స్థలం ఎక్కడ ఉంది తదితర వివరాలను మ్యాప్ ద్వారా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తదనంతరం జిల్లా కలెక్టర్ అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ఖాళీ భూమిని పరిశీలించారు. ఖాళీ భూమికి సంబంధించి సర్వే పనులు బుధవారం లాగా పూర్తిచేయాలని సర్వేయర్ రామ్మోహన్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో తాడపత్రి సమీపంలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ పక్కనున్న ఖాళీ స్థలంలో మరో 25 నుంచి 30 రోజుల్లోపు 500 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసేలా తాత్కాలిక ఆసుపత్రి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 1వ తేదీన ఆస్పత్రి ప్రారంభించేలా అత్యంత వేగవంతంగా అవసరమైన అన్ని రకాల పనులు చేపట్టాలన్నారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర్లో ఉన్న ఖాళీ స్థలంలో త్వరగా సర్వే చేపట్టి చేసి జంగిల్ క్లియరెన్స్ చేసేలా చూడాలన్నారు. డాక్టర్లకు, మెడికల్ సిబ్బంది ఉండేలా క్వార్టర్స్ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. తాత్కాలిక ఆస్పత్రి వద్ద ఎన్ని అంబులెన్సులు సిద్ధంగా ఉంచేలా చూడాలన్నారు. తాగునీటి సరఫరా, శానిటేషన్, మరుగుదొడ్లకు అవసరమైన నీటి ఏర్పాటు, విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు, రోడ్లు వేయడం తదితర అంశాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొద్దినెలల పాటు ఉపయోగించుకునేలా తాత్కాలిక ఆసుపత్రిని వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ, డిపిసి, డిఎంఅండ్హెచ్ఓ, ఏపీ ఎమ్ ఎస్ఐ డి సి తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పని చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గుణ భూషణ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం అజయ్ కుమార్, తహసిల్దార్ నాగభూషణ, ఏపీ ఎమ్ ఎస్ఐ డి సి ఈఈ రాజగోపాల్ రెడ్డి, ఏ ఈ లోకేష్, తదితరులు పాల్గొన్నారు.