వేడుకలకు 20 మందికే అనుమతి..
Ens Balu
3
శ్రీకాకుళం
2021-05-05 09:48:11
కోవిడ్ వ్యాప్తి కారణంగా వివాహ కార్యక్రమాలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. మండల ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులు, మండల అధికారులతో బుధ వారం కోవిడ్ నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. వివాహ వేడుకలకు హాజరయ్యేవారి పేర్లను తహశీల్దార్ కు సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేసారు. వివాహ వేడుకలు జరిగే ప్రదేశాలను తహశీల్దార్లు తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కర్ఫ్యూ అమలులో ఉందని ఆయన పేర్కొన్నారు. ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, సంస్ధలు, హోటళ్ళు, రెస్టారెంట్లు తదితర సంస్ధలు ఉంటాయని, 12 గంటల తరువాత అత్యవసర సేవలు – మందుల దుకాణాలు, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు, పాలు వంటి ఆహార పదార్ధాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు వారాలపాటు ఇది అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దుకాణాలు 12 గంటలకు మూసివేయాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. ఎక్కడా నలుగురు కంటే ఎక్కువగా ఉండరాదని ఆయన పేర్కొంటూ 144 సెక్షన్ అమలులో ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. దుకాణాల వద్ద క్యూ లైన్ లో కోవిడ్ నిబంధనల మేరకు నిలిచి ఉండవచ్చని, గుమిగూడి ఉండరాదని ఆయన పేర్కొన్నారు. గుమిగూడి రద్దీ ఉంటే 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు అవుతాయని కలెక్టర్ అన్నారు.