144 సెక్షన్ అమలులో వుంటుంది..


Ens Balu
1
కాకినాడ
2021-05-05 13:22:11

కోవిడ్-19 మహమ్మారి కట్టడి లక్ష్యంగా జిల్లాలోని పబ్లిక్ ప్రదేశాలలో 5గురు అంత కంటె ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడాన్ని నిషేదిస్తూ జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి సిఆర్పిసి సెక్షన్-144 సెక్షన్ అమలుపై బుధవారం ఆదేశాలు జారీ చేశారు.  ఈ ఆదేశాలు ఈ నెల 18వ తేదీ వరకూ అమలులో ఉంటాయని, కర్ఫ్యూ సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులలోని పేరా-3 నందు మినహాయించిన సంస్థలు, సేవలకు సంబంధించిన వ్యక్తులు తప్ప మరెవరూ మద్యాహ్నం 12 గం.ల నుండి మరుసటి రోజు ఉదయం 6 గం.ల వరకూ పబ్లిక్ ప్రదేశాలలో సంచరించ కూడదని ఆయన ఆదేశించారు.  పేరా-3లో అనుమతించిన సంస్థలు, కార్యాలయాలు, సేవలు మినహా తక్కిన అన్ని సంస్థలు, షాపులు, ఎస్టాబ్లిష్మెంటులు, కార్యాలయాలు, రెస్టారెంట్లను విధిగా మద్యాహ్నం 12 గం.లకు మూసివేసి, తదుపరి రోజు 6 గం.లకు తెరవాలన్నారు. రాష్ట ప్రభుత్వ జిఓ.192 ఉత్తర్వులు మేరకు కర్ఫ్యూ వేళలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ లాబ్ లు, ఫార్మసీలతో పాటు అత్యవసర సేవలు అందించే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్ కాస్టింగ్, ఐటి, ఐటి ఎనేబుల్డ్ సర్వీసులు, పెట్రోల్ పంపులు, ఎల్పిజి, సిఎన్జి, పెట్రోలియం అండ్ గ్యాస్ అవుట్ లెట్ల కు అనుమతి ఉందన్నారు.  అలాగే పవర్ జనరేషన్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్, వాటర్ సప్లయి, శానిటేషన్, కోల్డ్ స్టోరేజి, వేర్ హౌసింగ్, ప్రయివేట్ సిక్యూరిటీ సేవలకు అనుమతి ఉందన్నారు. అన్ని వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ఉత్పాదక పరిశ్రమలు  సంబంధిత వ్యవసాయ, పరిశ్రమల శాఖలు నిర్థేశించిన కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ నిర్వహించవచ్చునని తెలిపారు. అనుమతించిన సంస్థలు, సేవలకు హాజరైయ్యే  వ్యక్తులు తగిన గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుందన్నారు.   అంతర జిల్లా, అంతర రాష్ట్ర పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు అనుమతి లేదని, అత్యవసర సరుకుల రవాణా వాహనాలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఆటోలు, టాక్సీలు, సిటి బస్సులు వంటి లోకల్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఉదయం 6 నుండి మద్యాహ్నం 12 గం.ల మద్య మాత్రమే కోవిడ్ నిబంధనల పాటించేలా అనుమతిస్తారన్నారు. ముందుగా షెడ్యూల్ చేసుకున్న వివాహాలు, ఫంక్షన్లను స్థానిక అధికారుల పర్మిషన్ తో, గరిష్టంగా 20 మంది వ్యక్తుల హాజరు మించకుండా కోవిడ్ నిబందనలు పాటిస్తూ జరుపుకోవచ్చున్నారు.  ఈ ఉత్తర్వులను సంబందిత శాఖల అధికారులు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశిస్తూ, విపత్తు నియంత్రణ, ప్రజారోగ్యరక్షణ దృష్ట్యా చేపట్టిన ఈ నియమ, నిబందనలను పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సిఫార్సు