కోవిడ్ జాగ్రత్తలు నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులను కోరారు. బుధవారం ఆమె ఛాంబర్ లో జోనల్ కమిషనర్లు, ప్రధాన వైధ్యాధికారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కోవిడ్ రెండవ దశ చాలా ఉధృతంగా ఉన్నందున అధికారులు ఇంకా ముమ్మరంగా చర్యలు చేపట్టాలని, ప్రతీ వార్డులో కార్పొరేటర్ సూచనలు పాటిస్తూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయాలని సూచించారు. కొన్ని జోన్లలో వార్డులు ఎక్కువుగా ఉన్నందున, జోన్ ఒక్కొక్కటికి, ఒక టాటా ఏస్ మాత్రమే ఉన్నందున వాటి సమయం పెంచి రెండు పూటలా సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారి చేసే విధంగా చూడాలని ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. వార్డు వాలంటీర్ల ద్వారా హోమ్ ఐసొలేషన్లో ఎంత మంది ఉన్నారో, వారి ప్రైమరీ కాంటాక్ట్స్, వారికి కోవిడ్ మందులు కిట్స్ అందించే విధానం పై ఆరా తీసి, ఆయా వివరాలు తెలపాలని ఆదేశించారు. కోవిడ్ పేషంట్లు ఉన్న ఏరియాలలో సోడియం హైపోక్లోరైట్, వీధులలోనే కాకుండా ఇంటి పరిసరరాలలోను, ఇళ్ళల్లోనూ చల్లించాలని ఆ చట్టు ప్రక్కల బ్లీచింగు కూడా చల్లించాలని ఆదేశించారు. వార్డు స్థాయిలో ఏర్పాటు చేసిన స్పెషల్ అఫీసర్సుతో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. వార్డు అడ్మిన్, హెల్త్, శానిటరి, వెల్ఫేర్ మొదలగు వార్డు కార్యదర్శులు, ప్రతీ రోజు ఒక గంట వార్డులో తిరిగే విధంగా చూడాలని సూచించారు. ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి 250 బెడ్లు సమకూరుస్తున్నారని వాటిని మన కోవిడ్ సెంటర్లలో ఏర్పాటు చేస్తామని, ఈ రెండు సెంటర్లలో ఆక్సిజన్ ఉండే ఏర్పాట్లు అధికారులతో చేయించేలా చర్చిస్తున్నామని తెలిపారు. ఇంటివద్ద మరణించిన కోవిడ్ పేషంట్ ను తీసుకువెళ్ళుటకు చాలా ఇబ్బందిగా ఉందని, అందుకు వారి కొరకు జోనుకు ఒకటి చొప్పున ఒక మహా ప్రస్థానం (అంతిమ యాత్ర) వాహనం ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టామని, ప్రతీ జోన్లో కోవిడ్ తో మరణించిన వారి కొరకు ఒక స్మశాన వాటికను ఏర్పాటు చేసే ప్రక్రియ పరిశీలించాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. నగర పరిధిలోగల మొత్తం 72అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరియు కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి అనువుగా ఉన్న కమ్మ్యునిటీ హాల్స్ గాని, ప్రైవేట్ బిల్డింగ్స్ గాని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, జోనల్ కమిషనర్లు అడిగిన పలు ప్రశ్నలకు మేయర్ మరియు ప్రధాన వైద్యాధికారి సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రీ, జోనల్ కమిషనర్లు గోవింద రావు, బొడ్డేపల్లి రాము, ఫణిరాం, సింహాచలం, శ్రీధర్, చక్రవర్తి, బయోలజిస్ట్ (పైడిరాజు), తదితరులు పాల్గొన్నారు.