కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల్లో భాగంగా 2,219 పడకలు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయగా అందులో భాగంగా చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 530 పడకలు, 50 వెంటిలేటర్లు, మదనపల్లె జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 120 పడకలు, శ్రీ పద్మావతి ఆసుపత్రి (స్విమ్స్)లో 654 పడకలు, వెంటిలేటర్లు 60, రుయాలో 890 బెడ్లు, 138 వెంటిలేటర్లు, ఈఎస్ఐ తిరుపతిలో 250 పడకలు, ఎస్.వి ఆయుర్వేదిక్ ఆసుపత్రి నందు 210 పడకలు, శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు 50 పడకలు, కుప్పం ఏరియా ఆసుపత్రి నందు 60 పడకలు ఏర్పాటు చేయడమైనది తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 36 ప్రైవేట్ ఆసుపత్రులో ఐసియు మరియు నాన్ ఐసియు పడకలతో కలిపి 2,380 పడకలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
వీటితో పాటు కోవిడ్ కేర్ కేంద్రాలైన తిరుపతి పద్మావతి నిలయం – 1100, శ్రీనివాసం – 1270, విష్ణు నివాసం – 1034, ఆర్ వి ఎస్, చిత్తూరు – 170, మదనపల్లె లోని ఎస్ టి బాయ్స్ హాస్టల్ – 100 మరియు వశిష్టా పాఠశాల – 200, కార్వేటి నగరం లోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ – 100, వాయల్పాడు ఏ పి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ – 300, పలమనేరు పాలిటెక్నిక్ కాలేజీలో 128 పడకలను ఏర్పాటు చేయడమైనదని, కోవిడ్ బాధితులు వైద్య సూచనల మేరకు వారికి అందుబాటులో ఉన్న కోవిడ్ కేర్ కేంద్రాల నందు వైద్య సేవలు పొందవచ్చునని, అక్కడ అంబులెన్స్ సౌకర్యంతో పాటు డాక్టర్లు అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఈసిజి, ఎక్స్ – రే, రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.
కోవిడ్ లక్షణాలు ఉన్నట్లైతే పాజిటివ్ కాకున్నా స్థానిక పి హెచ్ సి, మెడికల్ అధికారులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల దగ్గర వెళ్ళి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జ్వరం, టైఫాయిడ్ అని చెప్పి కాలయాపన చేయకుండా జ్వరం తీవ్రత ఎక్కువై చివరి నిమిషంలో ఆసుపత్రిలకు చేరుకోవడం కంటే ముందుగానే కోవిడ్ లక్షణాలు ఉన్నట్లైతే పరీక్ష చేయించుకుని ట్రయాజింగ్ సెంటర్లో సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్, ఆసుపత్రికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన బాధితులకు వైద్యుల సూచనల మేరకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఆక్సిజన్ అందిస్తేనే . . రెమిడిసివర్ ఇంజక్షన్ ఇస్తేనే కరోనా నయం అవుతుందన్నది అపోహ మాత్రమే అని, అధిక ధర చెల్లించి ఆక్సిజన్ సరఫరా రెమిడిసివర్ ఇంజక్షన్లు కొనుగోలు చేయరాదని, ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్ బెడ్ మరియు రెమిడిసివర్ ఇంజక్షన్ అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కరోనా భయంతోనే ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని, మంచి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంను స్వేకరిస్తూ మనో ధైర్యంతో యోగా, ప్రాణాయామం లాంటి జాగ్రత్తలు పాటిస్తూ కోలుకోవచ్చునన్నారు. ఒక వేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లకు తెలియజేయాలని, వారు వెంటనే పరీక్షించి ఎక్కడకి పంపాలన్నది నిర్ణయించి సత్వర చికిత్సలు అందించేలా అన్ని చర్యలు చేపడతారని, సమస్య తీవ్రమైన తరువాత ఆసుపత్రులకు వచ్చి చేరడం కంటే కరోనా లక్షణాలు ఉన్న వెంటనే జాగ్రత్త పడి వైద్యుల సలహా మేరకు చికిత్స పొంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.