కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో బుధవారం నుంచి కర్ఫ్యూ అమలులో ఉందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం నుంచి రెండు వారాల పాటు ప్రతిరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. బుధవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ విధిస్తామన్నారు. ఆ సమయంలో ఎక్కడ ఐదుగురికి మించి గుమిగూడి ఉండడానికి వీలు లేదన్నారు. ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, సంస్ధలు, హోటళ్ళు, రెస్టారెంట్లు తదితర సంస్ధలు ఉంటాయని, 12 గంటల తరువాత అత్యవసర సేవలు – మందుల దుకాణాలు, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు, పాలు వంటి ఆహార పదార్ధాలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. దుకాణాలు 12 గంటలకు మూసివేయాల్సిందేనన్నారు. దుకాణాల వద్ద క్యూ లైన్ లో కోవిడ్ నిబంధనల మేరకు నిలిచి ఉండవచ్చని, గుమిగూడి ఉండరాదన్నారు. గుమిగూడి రద్దీ ఉంటే 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు అవుతాయన్నారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా వివాహ కార్యక్రమాలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. వివాహ వేడుకలకు హాజరయ్యేవారి పేర్లను తహశీల్దార్ కు సమర్పించాలని స్పష్టం చేసారు. వివాహ వేడుకలు జరిగే ప్రదేశాలను తహశీల్దార్లు తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు చేస్తారన్నారు.