శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కోవిడ్ బాధితులకు సేవలు సకాలంలో అందించుటకు ఉద్దానం ఫౌండేషన్ రెండు అంబులెన్సులను జిల్లా కలెక్టర్ జె నివాస్ కు అందజేసారు. ఈ మేరకు గురువారం సంస్థ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే, ఇచ్చాపురం నియోజకవర్గం వై.యస్.ఆర్.సి.పి సమన్వయకర్త పిరియా సాయిరాజ్, ఫౌండేషన్ కన్వీనర్ పిరియా విజయ రెండు ఉచిత అంబులెన్సులను జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద అందించారు. ఈ అంబులెన్సులను జిల్లా కలెక్టర్ ప్రారంభించి ఇచ్ఛాపురం తహశీల్దారుకు అందజేసారు. అంబులెన్సులు అందజేసిన ఉద్దానం ఫౌండేషన్ కు జిల్లా కలెక్టర్ నివాస్ కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉన్న సమయంలో రెండు వాహనాలు జిల్లా యంత్రాంగానికి అందడం ముదావహమన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించాలనే సంకల్పం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఉద్దానం ఫౌండేషన్ వ్యవస్ధాపకులు సాయిరాజ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నిర్మూలనలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యక్తిగత శ్రద్ధతో అన్ని చర్యలూ చేపడుతున్నారన్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్, మరో వైపు వైద్య సేవలు అందరికీ అందేలా నిత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు ఉద్దానం ఫౌండేషన్ ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా కోవిడ్ బాధితులకు అండగా నిలవాలని ఆశయంతో అంబులెన్సులను అందించడం జరిగిందన్నారు. ఫౌండేషన్ క్రియాశీలకంగా పని చేస్తూ సేవలను మరింతగా క్షేత్ర స్థాయిలో విస్తరింపజేయాలని ప్రభుత్వంతో పాటు కోవిడ్ బాధితుల సేవలో పాలు పంచుకోవాలనే సత్సంకల్పంతో రెండు ఉచిత అంబులెన్సులను ఆక్సిజన్ కిట్లతో పాటు అందించామని వివరించారు. ఆక్సిజన్ స్దాయి తగ్గిన కరోనా రోగులను విశాఖపట్నం, శ్రీకాకుళం ఆసుపత్రులకు సకాలంలో చేర్చాలనే ఉద్దేశ్యంతో అందజేసామని తెలిపారు. కరోనా మహమ్మారి పల్లెలోను, పట్టణాల్లోను విస్తృతంగా వ్యాపిస్తుందని, గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కరోనా భారిన పడి ఆక్సిజన్ అందక సుదూర ప్రాంతాల్లో వున్న విశాఖపట్నం, శ్రీకాకుళం పట్టణాల్లో గల మంచి వైద్యానికి చేరాలంటే సామాన్యులు హెచ్చు మొత్తంలో అంబులెన్సులకు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. అంబులెన్స్ ఖర్చులు భరించలేక కొంత మంది ఇంటివద్దనే వుండి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం కరోనా రోగుల పట్ల సకాలంలో స్పందిస్తు౦ది అందులో ఉద్దానం ఫౌండేషన్ వంతు సహాయంగా రెండు ఉచిత అంబులెన్సుల సహాయాన్ని అందించామని అన్నారు.