కర్ఫ్యూ అమలు చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రోజూ 18 గంటల పాటు అమలు చేయాలని నిర్ణయించిందని, దీనిని సమర్ధవంతంగా అమలుచేస్తే పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గడంతోపాటు ఆసుపత్రుల్లో పరిస్థితులు కూడా నియంత్రణలోకి వస్తాయని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. దీనిని అమలు చేయడంలో పోలీసు యంత్రాంగానికి ప్రజలంతా సహకరించి 12 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని, వ్యాపారస్తులు కూడా 12 గంటల సమయానికి తమ వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని కోరారు. ప్రజలు సహకరించి నిబంధనలు పాటిస్తే కోవిడ్ వ్యాప్తిని నిరోధించగలమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరుపై పరిశీలించే నిమిత్తం నగరంలోని పలు ముఖ్య కూడళ్లు, ముఖ్య రహదారుల్లో కలెక్టర్ గురువారం అదనపు ఎస్.పి. సత్యనారాయణరావుతో కలసి పర్యటించి ఆకస్మిత తనిఖీలు చేపట్టారు. ముందుగా మూడు లాంతర్ల కూడలి వద్దకు చేరుకొని 12-15 నిముషాల తర్వాత కూడా పలు షాపులు తెరచి వుండటాన్ని గమనించి ఆ షాపుల వద్దకు వెళ్లి మూసివేయించారు. రోడ్డుపై తోపుడుబళ్లు వ్యాపారుల వద్దకు వెళ్లి 12 తర్వాత వ్యాపారం నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. 12-30 గంటల సమయానికి కూడా మూడు లాంతర్ల కూడలి వద్ద వాహనాల రద్దీ వుండటాన్ని గమనించి పలువురు వాహనదారులను మందలించారు. ప్రభుత్వం 12 గంటల తర్వాత రోడ్లపై సంచరించరాదని స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా వాహనాలపై తిరగడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎం.జి.రోడ్డు మీదుగా కన్యకా పరమేశ్వరి కూడలి, పేర్ల వారి వీధి, మార్కెట్ ప్రాంతాలను పరిశీలించి తెరచి వున్న షాపులను మూసి వేయించారు. అనంతరం రింగురోడ్డు, కొత్తపేట నీళ్లటాంకు, అంబటిసత్రం ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు.
శుక్రవారం నుంచి మరింత కఠినంగా ఆంక్షలు అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఈ సందర్భంగా పోలీసు అధికారులకు సూచించారు. ఉదయం 11.30 గంటల నుంచే మైకుల ద్వారా షాపులు మూసివేయాలనే విషయాన్ని ప్రచారం చేసి అన్ని మార్కెట్లను సందర్శించి దగ్గర వుండి షాపులు మూసి వేయించాలన్నారు. రెవిన్యూ అధికారులతో బృందాలుగా ఏర్పడి అన్ని ప్రాంతాల్లోనూ 12 గంటలకు అన్ని షాపులు ఖచ్చితంగా మూసివేసేలా చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలకు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ట్రాఫిక్ డి.ఎస్.పి. ఎల్.మోహనరావు, తహశీల్దార్ ప్రభాకరరావు, సిఐలు శ్రీనివాస్, మంగవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకొనే రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను అమలు చేస్తోందన్నారు. ప్రజలంతా తు.చ.తప్పకుండా ఈ నిబంధనలన్నీ పాటించాలన్నారు. కోవిడ్ రెండో వేవ్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతోందని అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా వుంటూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బ్యాంకు సేవలు, జాతీయ రహదారుల పనులు, విద్యుత్ సరఫరా, మెడికల్ షాపులు, తాగునీటి సరఫరా వంటి కొన్ని రకాల అత్యవసర సేవలను కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇవ్వడం జరిగిందన్నారు.
జిల్లాలో కోవిడ్ బాధితులకు మూడు రకాల వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ చెప్పారు. ఇంట్లోనే వుంటూ వైద్యసేవలు పొందేవారికి ఫోన్‌ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని, ఇంట్లో ఐసోలేషన్‌లో వుండేందుకు సౌకర్యాలు లేని వారికి కోవిడ్ కేర్ సెంటర్లలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, ఆసుపత్రి సేవలు అవసరమైన వారిని ఆయా కోవిడ్ ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యసహాయం అందిస్తున్నట్టు చెప్పారు. కోవిడ్ సోకకుండా ప్రతిఒక్కరూ తమవంతుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకొనే వలస కార్మికులకు ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. వారికి నిత్యావసర సరుకులు అందించడం, క్వారంటైన్ కేంద్రాల్లో వారికి అవసరమైన భోజనం, ఇతర వసతులు కల్పించడం వంటి చర్యలు చేపడతామని, గ్రామాల్లో అవసరమైన వారికి పనులు కూడా కల్పిస్తామన్నారు.