కోవిడ్ రోగులకు రూ.350 తో బలవర్ధక ఆహారం..


Ens Balu
0
అనంతపురం
2021-05-06 14:42:53

కోవిడ్ సోకిన ఒక వ్యక్తికి ప్రతి రోజు రూ.350 ఖర్చుతో బలవర్ధకమైన ఆహారాన్ని అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నగర శివారులోని శిల్పారామంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ సోకిన వారికి అందించేందుకు సిద్ధం చేస్తున్న ఆహారం తయారీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సోకిన వారు త్వరితగతిన కోలుకునేలా డబ్బుకు, ఖర్చుకు వెనకాడకుండా నాణ్యత కలిగిన రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. జిల్లాలో కోవిడ్ సోకిన వారికి రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారాన్ని అందించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 3 కోవిడ్ ఆస్పత్రులు, 3 కోవిడ్ కేర్ సెంటర్లలో ఆహారాన్ని అందిస్తున్నామని, మిగిలిన ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. నగరంలోని శిల్పారామంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు 1800 మందికి పైగా కోవిడ్ సోకిన వారికి నాణ్యత కలిగిన రోగనిరోధక శక్తి పెంచే ఆహారం అందజేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కోవిడ్ 19 మెనూ ప్రకారం ఆహారాన్ని తయారుచేసి అందిస్తున్నామన్నారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 580 మందికి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 400 మందికి, క్యాన్సర్ ఆస్పత్రిలో 260 మందికి, జె ఎన్ టి యు కోవిడ్ కేర్ సెంటర్ లో 330 మందికి, శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 70 మందికి, లేపాక్షి లోని బాలయోగి గురుకులం లో ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్ లో 185 మందికి కలిపి మొత్తం 1825 మందికి గురువారం ఆహారాన్ని సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు బెల్లం, పాలు కలిపి రాగిజావా అందిస్తున్నామన్నారు. అనంతరం అల్పాహారం మెనూ ప్రకారం ప్రతిరోజు ఒక రకమైన టిఫిన్ అందిస్తున్నామని, మధ్యాహ్నం ప్రతిరోజు చికెన్ కర్రీ అందిస్తున్నామని, అన్నం, చపాతి, వెజ్ కర్రీ, పప్పు కూర కూడా అందిస్తున్నామన్నారు. సాయంత్రం 4:30 గంటలకు టీ, బిస్కెట్ అందిస్తున్నామన్నారు. అలాగే రాత్రికి చికెన్ స్థానంలో ఉడికిన గుడ్లు 2 ఇస్తున్నామని, గుడ్లతో పాటు అన్నం, చపాతీ, చట్నీ, వెజ్ కర్రీ ఇస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు కోవిడ్ సోకిన వారు త్వరితగతిన కోలుకునేలా బలవర్ధకమైన, రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని సరైన వేళలకు కోవిడ్ 19 ఫుడ్ మెనూ చార్ట్ ప్రకారం అందిస్తున్నామన్నారు. మంచి నాణ్యత కలిగిన రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకొని కోవిడ్ సోకిన వారు త్వరితగతిన కోలుకొని వారి ఇళ్లకు చేరుకుంటున్నారన్నారు. ఆహారాన్ని ఎలాంటి ప్లాస్టిక్ వాడకం లేకుండా, పరిశుభ్రంగా ప్యాక్ చేసి కోవిడ్ సోకిన వారికి అందిస్తున్నామన్నారు. నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఆహారాన్ని తయారు చేసి అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. నాణ్యత కలిగిన ఆహారాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ కోవిడ్ సోకిన వారికి అందిస్తున్నారని, ఇందుకు పర్యాటక శాఖ అధికారి దీపక్, పర్యాటక శాఖ అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్, కర్నూలు, అనంతపురం జిల్లాలకు కోవిడ్ కేర్ సెంటర్ల ఇంచార్జ్ బాబూజీలను జిల్లా కలెక్టర్ అభినందించారు. కోవిడ్ సోకిన వారికి ఇలాగే నాణ్యత కలిగిన ఆహారాన్ని ఇకముందు కూడా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శుక్రవారం నుంచి నగరంలోని ఎస్సి బాయ్స్ హాస్టల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ సోకిన వారికి అందించే ఆహారాన్ని తయారు చేస్తామని పర్యాటక శాఖ అధికారి తెలిపారు.

అంతకు ముందు  పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు భోజనం సరఫరా ఎలా జరుగుతుందో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ సోకిన వారికి అందించే భోజనం నాణ్యతతో ఉందా లేదా అని తనిఖీ చేశారు. భోజనాన్ని ప్యాకింగ్ చేసి అందించడం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలలో టిఫిన్, భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నరా లేదని గిరిజన శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సోకిన వారికి సరైన వేళలకు క్రమం తప్పకుండా నాణ్యత కలిగిన భోజనాన్ని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

సిఫార్సు