విశాఖలో మరో 300 పడకలు సిద్ధం..


Ens Balu
2
విశాఖపట్నం
2021-05-06 14:54:02

కరోనావైరస్ సోకి, ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సరఫరా సదుపాయం ఉన్న 300 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ షీలానగర్‌లో ఉన్న వికాస్ విద్యానికేతన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్న ఈ కోవిడ్ వైద్య సేవల కేంద్రం పనులను గురువారం విజయసాయి రెడ్డి పర్యవేక్షించారు. ఈమధ్యనే నగరంలో కరోనా రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరును విజయసాయి రెడ్డి స్వయంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పీపీఈ కిట్ ధరించి నేరుగా ఆస్పత్రికి వెళ్లిన విజయసాయి రెడ్డి, కరోనా రోగులతోను, వారి బంధువులతోనూ మాట్లాడి, వారి బాధలు విన్నారు. పలు సలహాలు, సూచనలు స్వీకరించారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా విజృంభణ, ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్న రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించేందుకు సంకల్పించారు.

కోవిడ్ రోగులకు అవసరమైన అత్యవసర వైద్య సహాయాన్ని ఈ కేంద్రంలో అందజేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణానికి బెడ్స్ చేరగా, ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి, సోమవారం నాటి కల్లా పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి అధికారులకు,పౌండేషన్ సభ్యులకు సూచించారు. 

దీంతో ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న కోవిడ్ బాధితులు ఈ కేంద్రానికి వచ్చి వైద్య సేవలు పొందవచ్చు. వైద్యం, మందులతో పాటు రోగులకు మూడు పూటలా మంచి భోజనం కూడా ఇక్కడ అందించాలని విజయసాయి రెడ్డి సూచించారు. ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న తమ వారి గురించి తమకు సమాచారం అందటం లేదని రోగుల బంధువులు పలువురు విజయసాయిరెడ్డి దృష్టికి గతంలో తీసుకువచ్చారు. దీంతో ఈ కేంద్రంలో వైద్య సేవలు పొందే రోగులకు సంబంధించిన సమాచారాన్ని వారి బంధువులకు ప్రతిరోజూ అందించే ప్రయత్నం కూడా చేయనున్నారు. 

ఖర్చుకు వెనకాడకుండా, రోగులకు మంచి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని విజయసాయి రెడ్డి చెప్పారు. అందుకొసం ఆంధ్రా మెడికల్ కాలేజీ వైద్య సిబ్బంది, జిల్లా వైద్య అధికారుల సహకారం తీసుకొనున్నట్టు చెప్పారు...ప్రతి 30 మంది రోగులకు ఒక డాక్టరు ఇద్దరు నర్సులు వారికి ఇక్కడ అందుబాటులో ఉందన్నారు. ఇలా రోజుకు మూడు స్విఫ్ట్ లలో  డాక్టర్లు, నర్సులు  కరోనా బధితులకు వైద్య సహాయం అందించనున్నారు. ఈ 300 పడకల లో పూర్తిస్థాయిలో ఆక్సిజన్ తో కూడిన మెడికల్ వైద్యం అందిస్తారు. అలాగే రోగులకు మూడు పూటలా ఆహార సదుపాయం కల్పించనున్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ,కిమ్స్,విమ్స్,డి.ఎమ్.హెచ్.వో వైద్యులు సిఫార్సు చేసిన రోగులతొ పాటుగా, కారోన బారినపడిన వారు నేరుగా ఈ కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చని ఆయన తెలిపారు.. ఎటువంటి తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా ఈ క్రమం ఈ కేంద్రానికి రావచ్చునని విజయసాయి రెడ్డి  వెల్లడించారు

ఈ కేంద్రంలోనే  ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ శాంపిల్ కలెక్షన్‌కు కూడా ఏర్పాట్లు చేయాలని సంకల్పించారు. ఇక్కడికి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య సదుపాయాలు అందించనున్నారు.

కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో అనేక కార్యక్రమాలను తొలి నుంచి నిర్వహిస్తున్నారు. 

కాగా, గురువారం విజయసాయి రెడ్డితో పాటు వికాస్ విద్యానికేతన్‌లో కోవిడ్ కేంద్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్, డీఎంహెచ్ఓ పి సూర్యనారాయణ, జీవీఎంసీ ప్రాజెక్టు డైరెక్టర్ వై శ్రీనివాస్, ప్రగతి భారత్ ఫౌండేషన్ ప్రతినిధులు గోపినాధ్ రెడ్డి జాస్తి బాలాజీ తదితరులు ఉన్నారు.
సిఫార్సు