ప్రభుత్వ, ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులకు ప్రణాళిక ప్రకారం ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని, జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ డి.మురళీధరెడ్డి తెలిపారు. జిల్లాలో కోవిడ్ పరీక్షలు, రోగులకు వైద్య సేవలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై గురువారం సాయంత్రం కలెక్టర్ మురళీధర్‌రెడ్డి వర్చువల్ విధానంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు విశాఖపట్నం, అంగూల్ (ఒడిశా) నుంచి ఆక్సిజన్ వస్తోందని.. అన్‌లోడింగ్, ఫిల్లింగ్ ఆధారంగా ఆసుపత్రుల అవసరాలకు అనుగుణంగా సిలిండర్లను అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రోజువారీ వినియోగం 33.8 కిలో లీటర్లు కాగా, సరఫరా ద్వారా 30 కిలో లీటర్లు ట్యాంకులలోను, 3 కిలోలీటర్లు సిలిండర్లలలోను మొత్తంమీద రోజువారీగా 33 కిలో లీటర్లు మేర ఆక్సిజన్ అందుబాటులో ఉంటోందని వివరించారు. ఆక్సిజన్ వినియోగంలో నిబంధనలను అతిక్రమించిన కాకినాడలోని ఫౌండేషన్ ఆసుపత్రికి కోవిడ్ చికిత్స అనుమతులను రద్దుచేశామని.. 78 కోవిడ్ నోటిఫై ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉంటోందని, వీటిలో ఉల్లంఘనలకు పాల్పడిన మరికొన్ని ఆసుపత్రులను ఇప్పటికే గుర్తించామని, వీటిని కూడా డీనోటిఫై చేయనున్నట్లు తెలిపారు. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ వినియోగంతో పాటు చికిత్సా ప్రమాణాలపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అవసరానికి మించి ఆక్సిజన్‌ను నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించినా, ఎక్కువగా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో గురువారం ఎనిమిది వేల మందికి పరీక్షలు నిర్వహించగా.. 44.68 శాతం పాజిటివిటీ నమోదైందని, చాలా ఫోకస్డ్‌గా కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించడం వల్ల ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణ స్థాయి వ్యాప్తి 15 శాతం లోపే ఉందని కలెక్టర్ తెలిపారు.
గురువారం కోవిడ్ ఆసుపత్రుల నుండి స్వస్థత పొంది 757 మంది డిశ్చార్జి కాగా, క్రొత్తగా 417 అడ్మిషన్లు జరిగాయని.. దీంతో 340 పడకలు ఖాళీ అయి, అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పాజిటివిటీ 15 శాతం లోపే ఉన్నప్పటికీ స్థిరీకరణను దృష్టిలో ఉంచుకొని రంపచోడవరం, చింతూరులో కోవిడ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేర్ కేంద్రాలకు ఆరు వేల పడకల సామర్థ్యం ఉన్నట్లు తెలిపారు. ఈ సీసీసీల్లో ప్రస్తుతం 817 మంది ఉన్నారని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, డిజిటల్ ఎక్స్‌రే మిషన్ వంటి వాటిని సిద్ధంగా ఉంచామన్నారు. తొలుత పూర్తిస్థాయిలో ట్రయాజింగ్ చేసిన తర్వాత మాత్రమే ఆసుపత్రులు, సీసీసీల్లో అడ్మిషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. కోవిడ్, కోవిడేతర కారణాల వల్ల మరణించిన వారికి సంబంధించి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు విధానాన్ని నిర్థేశించామని, ఈ అంశాన్ని జిల్లాస్థాయిలో జేసీ (సంక్షేమం) జి.రాజకుమారి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియలో సేవాభావంతో పాల్గొనేలా గ్రామీణ ప్రాంతాల్లో యూత్‌క్లబ్‌లను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. యు.కొత్తపల్లిలో యూత్‌క్లబ్ సభ్యులు, వాలంటీర్లు అంతిమ సంస్కారాలకు సంబంధించి ఇటీవల చేసిన ఓ మంచి ప్రయత్నం ఇందుకు స్ఫూర్తి నిచ్చిందని ప్రశంసించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 31 మహాప్రస్థానం వాహనాలను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోవిడ్ కట్టడికి ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటుచేశామని, ఇవి క్రియాశీలంగా పనిచేస్తున్నాయని.. గురువారం సర్పంచ్‌లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు.
వ్యాక్సినేషన్‌కు కూపన్లు:
భారత ప్రభుత్వం నుంచి అందుతున్న డోసుల మేరకు జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మే 5, 6 తేదీల్లో రెండో డోస్ పంపిణీ మాత్రమే చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఏడో తేదీ నుంచి చేపట్టే వ్యాక్సిన్ పంపిణీకి లబ్ధిదారులకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల ద్వారా ఒకరోజు ముందే కలర్ కోడ్ కూపన్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కూపన్లను నిర్దేశ వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకెళ్లి, టీకా వేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, వృద్ధులకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని తెలిపారు. జనరల్ పబ్లిక్‌కు సంబంధించి 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే డోసులు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అర్హుల రిజిస్ట్రేషన్, టీకా పంపిణీ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశామని, అనర్హులకు ఎవరైనా టీకా వేస్తే ఆ ఘటనతో సంబంధమున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కాకినాడలో నిబంధనలు ఉల్లంఘించిన అయిదుగురు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇండెంట్, డీడీలు అందించిన ప్రైవేటు ఆసుపత్రులకు అందించేందుకు ప్రస్తుతం రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో కోవిడ్ బాధితుల గుర్తింపు, హోం ఐసోలేషన్, వ్యాక్సినేషన్, శానిటైజేషన్ తదితర అంశాల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
వైద్య, ఇతర సేవలపై నిరంతర పర్యవేక్షణ: జేసీ(ఆర్) డా. జి.లక్ష్మీశ
జిల్లాలోని కోవిడ్ నోటిఫై ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలతోపాటు ఆక్సిజన్, ముఖ్య ఔషధాల వినియోగం, ఆహారం, శానిటైజేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లోపాల సవరణకు ప్రయత్నిస్తున్నామని జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో ఆక్సిజన్ నిల్వలు, వినియోగంపై తనిఖీ చేసేందుకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్, వైద్య, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కూడిన మొబైల్ ఆక్సిజన్ మానిటరింగ్ స్వ్కాడ్ పనిచేస్తున్నట్లు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉందని ఆక్సిజన్‌కు ఎక్కడా కొరత లేదని, కావాలని వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్ప్ డెస్క్, వైద్య సేవలు, మెడికల్ వ్యర్థాల నిర్వహణ, ఫైర్ సేఫ్టీ, వైద్య సిబ్బంది, ఆరోగ్యశ్రీ అమలు తదితర ప్రమాణాల ఆధారంగా ఆసుపత్రుల పనితీరును మదిస్తున్నామని, సరైన ప్రమాణాలు పాటించని ఆసుపత్రులను డీనోటిఫై చేస్తామని జేసీ వెల్లడించారు.
శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాలు: జేసీ(డీ) కీర్తి చేకూరి
జిల్లాలో శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వైరస్ ఉద్ధృత వ్యాప్తి, వేసవి నేపథ్యంలో ఈ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని జేసీ (డీ) కీర్తి చేకూరి తెలిపారు. ప్రస్తుతం కోవీషీల్డ్ డోసులు అందుబాటులో ఉన్నాయని మండలానికి 200-300 డోసులు చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెడ్ కలర్, 45-60 ఏళ్ల వారికి బ్లూ కలర్, 60 ఏళ్లు పైబడిన వారికి గ్రీన్ కలర్ కూపన్లను సచివాలయాల వారీగా అందిస్తామని వివరించారు. ఈ కూపన్లు పొందిన అర్హులైన వారు నిర్దేశ వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవాల్సి ఉంటుందని జేసీ కీర్తి చేకూరి తెలిపారు.
అంతిమ సంస్కారాలకు ప్రోటోకాల్: జేసీ(డబ్ల్యూ) జి.రాజకుమారి:
కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో దురదృష్టవశాత్తు మరణాలు సంభవిస్తే గౌరవప్రదంగా మృతదేహాల తరలింపు, అంతిమ సంస్కారాల నిర్వహణకు ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించి, అమలు చేస్తున్నట్లు జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి తెలిపారు. ఈ మార్గదర్శకాలను ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు పంపినట్లు వెల్లడించారు. ప్రభుత్వమే ఉచితంగా మృతదేహాన్ని తరలించేందుకు చర్యలు తీసుకుంటుందని, అయితే ఎవరైనా తామే మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లి, కోవిడ్ జాగ్రత్‌బలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పిన సందర్భంలో రవాణా శాఖ నిర్దేశించిన ఛార్జీలను మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని, ఈ నిబంధనలను ఉల్లంఘించి దోపిడికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. డెడ్ బాడీ తరలింపునకు వాహన అద్దె కింద రూ.1,500; డ్రైవర్ బత్తా రూ.375; క్లీనర్ బత్తా రూ.300; ఫ్యూయల్ ఛార్జ్ ఆరు కి.మీ.లకు లీటరు చొప్పున, అలాగే అంతిమ సంస్కారాలకు గరిష్టంగా 4,500 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని జేసీ(డబ్ల్యూ) స్పష్టం చేశారు.