కోవిడ్ బాధిత చిన్నారులకు రక్షణ గృహం..
Ens Balu
2
శ్రీకాకుళం
2021-05-07 13:34:11
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్-19 దృష్ట్యా సమస్య ఎదుర్కొంటునన్న చిన్నారులకు బాలల రక్షణ గృహంలో వసతి కల్పించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ మరియు బాలల సంరక్షణ కమిటి ఛైర్మన్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం ఒక ప్రకటన జారీ చేస్తూ కోవిడ్ భారిన పడిన చిన్నారుల తల్లిదండ్రులు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో చేరిగాని లేదా హోమ్ ఐసోలేషన్ లో ఉండిగాని కోలుకుంటున్నారని ఆయన అన్నారు. కోలుకున్న తరువాత పరీక్షలలో నెగిటివ్ వచ్చినప్పటికి చిన్నారుల సంరక్షణకు బంధువులు, సంరక్షకులు గాని ముందుకు రాకపోతే అటువంటి పిల్లలకు రక్షణ గృహంలో వసతి కల్పించడం జరుగుతోందని చెప్పారు. అంతేకాకుండా కోవిడ్-19తో తల్లిదండ్రులు మరణించి, సంరక్షకులు ఎవ్వరూ లేక అనాథలుగా మిగిలిన పిల్లలకు కూడా రక్షణ గృహంలో వసతి కల్పించడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బాలల సంక్షేమం, సంస్కరణ సేవలు, వీధి బాలల సంక్షేమ శాఖ మరియు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గల బాలల రక్షణ గృహాలలో వసతి కల్పించి, సంరక్షించడం జరుగుతుందని ఆయన వివరించారు. కోవిడ్-19 బాధిత 18 సంవత్సరం లోపు వయస్సు గల బాలబాలికల సంరక్షణకు చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెం. 1098, మహిళా హెల్ప్ లైన్ నెం. 181 కు సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కరోనా నుండి కోలుకున్న తరువాత వారి పిల్లలను నిబంధనలను అనుసరించి అప్పగించటం జరుగుతుందని ఆయన వివరించారు. తల్లిదండ్రులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.