ఆక్సీజన్‌కు ఎటువంటి కొరతా లేదని, కేవలం గంటలోనే ఆయా ఆసుపత్రులకు ఆక్సీజన్ సరఫరా చేస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా అవసరాలకు సరిపడా ఉత్పత్తి జరుగుతోందని, ప్లాంట్లు నుంచి నేరుగా ఆక్సీజన్‌ను కొనేందుకు కూడా ఆసుపత్రులకు అనుమతినిచ్చినట్లు తెలిపారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో సోనీ ఎంటర్ ప్రైజెస్, శ్రీ సాయి శ్రీనివాస గ్యాసెస్ మొదలగు రెండు ప్రయివేటు ఆక్సీజన్ ఫిల్లింగ్ కంపెనీలను, సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే తో కలిసి శుక్రవారం జెసి పరిశీలించారు. ఆక్సీజన్ లభ్యత, ఫిల్లింగ్ సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆక్సీజన్ సిలండర్ల ఉత్పత్తి ఆగకుండా చూడాలని యాజమాన్యాలను ఆదేశించారు.
ఈ సందర్భంగా జెసి మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా అవసరాలకు సరిపడినంతగా ఆక్సీజన్ సిలండర్ల ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరంలో ఉన్న బొబ్బిలి నుంచి కేవలం గంటలోనే ఎక్కడికైనా ఆక్సీజన్‌ను సరఫరా చేయగలమని చెప్పారు. రోజువిడిచి రోజు జిల్లాకు 10 కిలోలీటర్ల ఆక్సీజన్ ట్యాంక్ వస్తోందని, దీనితో రోజుకు సుమారు 500 సిలండర్ల ఫిల్లింగ్ జరుగుతోందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు సుమారుగా 450 వరకూ సిలండర్లు అవసరం అవుతున్నాయని, ఆ మేరకు నిరాటంకంగా ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్పత్తి పర్యవేక్షణకు ముగ్గురు నోడల్ అధికారులను నియమించామని, ఆయా ఆసుపత్రులు ముందుగా నోడల్ అధికారులను సంప్రదించి, తమకు కావాల్సిన ఆక్సీజన్ సిలండర్లను తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పించామని చెప్పారు. ఇప్పటికే ఇక్కడినుంచి పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి నేరుగా ఆక్సీజన్ సరఫరా అవుతోందన్నారు.
అన్ని ప్రయివేటు కార్పొరేట్ ఆసుపత్రులు, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలకు బొబ్బిలి నుంచి ఆక్సీజన్ సిలండర్లు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. మిమ్స్ ఆసుపత్రికి శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి ఆక్సీజన్ వస్తోందన్నారు. వంద పడకలు, దానికంటే ఎక్కువగా ఉన్న జిల్లా కేంద్రాసుపత్రి, మిమ్స్ ఆసుపత్రి, పార్వతీపురం ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సీజన్ నిల్వ కోసం జెర్మన్ హేంగర్స్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రక్రియ రెండుమూడు రోజుల్లో పూర్తి అవుతోందని చెప్పారు. అందువల్ల కోవిడ్ పేషెంట్లు ఆక్సీజన్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జెసి సూచించారు.
ఈ పర్యటనలో బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు, తాశీల్దార్ ఆర్. సాయికృష్ణ, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కో-ఆర్డినేటర్ జి.అశోక్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఆక్సీజన్ సరఫరా నోడల్ అధికారులు ః -
జి.అశోక్ కుమార్, జిల్లా కో-ఆర్డినేటర్, సచివాలయాలు ః 9030546667
ఆర్.సాయికృష్ణ, తాశీల్దార్, బొబ్బిలి ః 9618006488
ఎస్.వెంకటేశ్వర్లు, ఎస్‌డిసి, ః 8106378646