రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. దీనిప్రకారం జిల్లాలోని జిల్లా, మండల, గ్రామస్థాయిలో వుండే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈనెల 18వ తేదీ వరకు ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు పనిచేస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. 12 గంటల తర్వాత కూడా ఎవరైనా ఉద్యోగుల సేవలు అవసరం ఉన్నట్లయితే వారికి ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తారని పేర్కొన్నారు. కోవిడ్ నిర్వహణలో అత్యవసర సేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్, మునిసిపల్ పరిపాలన, పంచాయతీరాజ్ శాఖలకు ఈ పనివేళలు వర్తించవని పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ శాఖలన్నీ మార్పు చేసిన పనివేళల ప్రకారం పనిచేయాల్సి వుంటుందని తెలిపారు.