అతి పిన్నవయస్సులోనే స్వాతంత్ర్యం కొరకు బ్రిటీషు వారిని ఎదరించిన తొలి తరం స్వాతంత్ర్య సమరయోధులలో అల్లూరి సీతారామరాజు ఒకరని ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరి వర్థంతి సంధర్బంగా సీతమ్మధారలో గల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతి చిన్నవయస్సులోనే 4 సంవత్సరాలపాటు బ్రిటీషు వారిని ఎదిరించి పోరాడారని తెలిపారు. పాండ్రంగిలో జన్మించిన ఆయన ఉద్యమబాట పట్టి బ్రిటీషు వారి దోపిడీని ఎదిరించి పోరాటంలో అశువులు బాసారని, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఆయన సమాధి అయ్యారని అన్నారు. కులమతాలకు అతీతంగా ధన, మాన, ప్రాణాలను దారపోసి ఎందరో మహానుభావులు త్యాగఫలం మనం అనుభవిస్తున్నామని, ప్రతి సంవత్సరం పాండ్రంగి, కృష్ణదేవిపేటలలో అల్లూరిని స్మరించుకొంటూ కార్యక్రమాలను ఘణంగా జరుపుకొనేవారమని, ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా సామాన్యంగా జరుపుకోవలసి వచ్చిందన్నారు.
అదేవిధంగా కోవిడ్ సెకెండ్ వేవ్ ఉదృతంగా ఉన్నదని, మొదటి వేవ్ వైరస్ ఎక్కువ వయసు వారికే సంక్రమించేదని, ప్రస్తుతం సెకెండ్ వేవ్ వైరస్ ప్రమాదకరమని, ఇది అన్నివయస్సుల వారికి సోకుతుందని, ఆక్సిజన్ లెవెల్స్ అకస్మాత్తుగా తగ్గిపోయి అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ సరఫరాలను ప్రభుత్వం పెంచిందని వివరించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కరోనాను ఎదుర్కొనుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనుటకు ప్రజల సహకారం కూడా అవసరమని వ్యాధి చికిత్సకంటే నివారణ ముఖ్యమన్నారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, బౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జి.వి.యం .సి. కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు, బాణాల శ్రీను, ఎస్.పద్మారెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాసరెడ్డి, గుడివాడ ఫృద్వి తదితరులు పాల్గొన్నారు.