ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే కోవిడ్ కేర్ కేర్ సెంటర్లకు తరలించి, చికిత్సను అందించాలని రాష్ట్ర పట్టణాభివృద్ది, పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. జ్వరం వచ్చిన వెంటనే కేర్‌సెంటర్‌కు తరలించడం ద్వారా, వారికి సత్వరమే చికిత్సను అందించడంతోపాటుగా, వ్యాధి వ్యాప్తిని అడ్డుకొనేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. జిల్లాలోని పలువురు ఉన్నతాధికారులు, వైద్యారోగ్యశాఖాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తాశీల్దార్లు, ఎంపిడిఓలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. కోవిడ్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ముందుగా కలెక్టర్ హరి జవహర్ లాల్, మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, కోవిడ్ వ్యాధి పట్ల స్థానికంగా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలోని అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సీజన్, ఇతర వసతులను కల్పించాలని ఆదేశించారు. జ్వరాలపై దృష్టిపెట్టి, వెంటనే వారికి చికిత్సను అందించే ఏర్పాటు చేయాలన్నారు. రెమిడిసివిర్, ఇతర మందుల కొరత రాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్లంతా మరింత అప్రమత్తంగా ఉండాలని, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. మృతదేహాలను త్వరగా తరలించాలని, అవసరమైతే అదనంగా అవుట్‌సోర్సింగ్ పద్దతిలో సిబ్బందిని తీసుకోవాలని, ప్రయివేటు అంబులెన్సుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో కలిసి రెండు మూడు రోజుల్లో కోవిడ్‌పై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తామని, దీనికి అధికారులంతా సిద్దంగా ఉండాలని మంత్రి కోరారు.
కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, జ్వరాలపై సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంత త్వరగా జ్వరాలను గుర్తిస్తే, అంత త్వరగా వ్యాధిని నయం చేయవచ్చని అన్నారు. సర్వేలో వాలంటీర్ల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ఎంపిడిఓలు సర్వేను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్ఎంలు జ్వర బాధితుల ఇళ్లకు వెళ్లి, వారికి ప్రాధమిక పరీక్షలను నిర్వహించాలన్నారు. అలాగే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి కోవిడ్ కిట్లను పూర్తిచేసి, వారి వివరాలను తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కర్ఫ్యూ సమయంలో ప్రజల రాకపోకలను పూర్తిగా కట్టడి చేయాలని, వారు ఇళ్లకే పరిమితం అయ్యేటట్టుగా చూడాలన్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో నిర్వహించే కార్యకలాపాల్లో తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులను ధరించేలా చూడాలని కలెక్టర్ కోరారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, ఐటిడిఏ పీవో ఆర్.కూర్మనాధ్, ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్లు, తాశీల్దార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.