కేంద్రీయ విద్యాలయానికి ఎంపికైన విద్యార్ధులంతా ఉన్నత చదువులు చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని రాజమహేంద్రవరం ఎంపీ , వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ ఆకాంక్షించారు. శనివారం శనివారం నగరంలోని మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో ఇటీవల డ్రాలో ఎంపికై సీట్లు సాధించిన పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎంపీని కలిసి అభినందనలు తెలియజేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తమ కలను మీరు సాకారం చేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీని అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ ఎంపి భరత్ రామ్ మిఠాయిలను పంచారు. విద్యార్థులందితో కలిపి సరదాగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయంలో అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారని, అటువంటిది డ్రాలో అదృష్టం మీ చిన్నారులను వరించిందని అన్నారు.
మీ పిల్లల అభిరుచులకు తగ్గట్టుగా వారిని చదివిస్తే వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినవారవుతారన్నారు. ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి విద్యావంతులుగా తీర్చి దిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి సాగర్ జిల్లా అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ అన్నపూర్ణ రాజు, నాయకులు బిల్డర్ చిన్నా, ఎం గణేష్ బాబు, బి చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు.