కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వయంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. కోవిడ్‌పై పోరులో సర్పంచ్‌ల పాత్ర ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పంచాయితీ అధికారులతో ఆయన శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లానుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ, కరోనాను నియంత్రించాలంటే, ఈ వ్యాధిపట్ల ప్రతీఒక్కరిలో అవగాహన కల్పించి, జాగ్రత్తలు పాటించేలా సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. తప్పనిసరిగా మాస్కులను ధరింపజేయడం, తరచూ చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఈ మూడు ముఖ్యమైన పనులు చేస్తే కరోనా అంతమవుతుందన్నారు. పూర్తిగా అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే ఇటీవల మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే ఎవరికైనా కోవిడ్ సోకితే, వారిపట్ల మానవతా దృక్ఫథాన్ని ప్రదర్శించాలన్నారు. లక్షణాలు లేనివారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నామని, ఇటువంటి వారికి కోవిడ్ కిట్లను ఇంటివద్దకే పంపిస్తున్నామని చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు, హౌస్ క్వారంటైన్‌లో ఉన్నవారు ఇళ్లనుంచి బయటకు రాకుండా చూడాలని సర్పంచ్‌లను కోరారు.
కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని, ఐసోలేషన్‌లో ఉండే అవకాశం లేనివారినీ కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించాలన్నారు. జిల్లాలో ఏడు కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వీటిలో సుమారు 3వేల పడకలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. ఆక్సీజన్ స్థాయిలు పడిపోయినవారికి, ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నామన్నారు. జిల్లో ఇప్పటికే 28 కోవిడ్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కర్ఫ్యూను అమలు చేస్తోందని, దీనికి గ్రామ ప్రథమ పౌరులంతా తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు. కర్ఫ్యూ సమయంలో ప్రతీ షాపు మూసివేయాలని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండేలా చూడాలన్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో మాస్కును ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. నిబంధనలను పాటించని వారి వివరాలను రెవెన్యూ, లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ప్రస్తుత సమయంలో సర్పంచ్‌లంతా పారిశుధ్యంపైనా, త్రాగునీటి సరఫరా పైనా దృష్టి పెట్టాలని కలెక్టర్ కోరారు. కాలువల్లో పూడికను తొలగించాలని, గ్రామాల్లో హైపో క్లోరియం, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయాలన్నారు. వేసవిలో గ్రామ ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో వడగాడ్పులు ఎక్కువగా ఉంటాయని, అలాగే పాముకాట్లు, తేలు కాట్లు కూడా ఎక్కువగా చోటు చేసుకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లాను హరిత విజయనగరంగా మార్చడంలో సర్పంచ్‌లు కూడా భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటేందుకు అవకాశం ఉన్న స్థలాలను ఇప్పటినుంచే గుర్తించి, జూన్ మొదటి వారంలో వర్షాలు పడే సమయానికి మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం, పరిశుభ్రం, పరిపూర్ణ ఆరోగ్యం మన లక్ష్యాలని, ఈ మహాయజ్ఞంలో సర్పంచ్‌లంతా భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
ఈ సందర్భంగా మెరకముడిదాం మండలం గర్భాం, కొమరాడ మండలం చోళ్లపథం సర్పంచ్‌లు కలెక్టర్‌తో మాట్లాడి, తమ గ్రామ సమస్యలను వివరించి, పరిష్కారానికి కలెక్టర్ నుంచి హామీని పొందారు. కాన్ఫరెన్స్‌లో సర్పంచ్‌లతోపాటు ఇఓపిఆర్‌డిలు, పంచాయితీ అధికారులు, సుమారు 500 మంది సర్పంచ్‌లు పాల్గొన్నారు.