కోవిడ్ బాధితుల కోసం తాడిపత్రి అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో 500 ఆక్సిజన్ బెడ్ల తో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. శనివారం తాడిపత్రి వద్ద అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో కరోనా నేపథ్యంలో 500 ఆక్సిజన్ బెడ్ల తో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రి కోసం స్థలాన్ని మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తదితరులు పరిశీలించారు. అనంతరం తాడిపత్రి అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో ప్రతి రోజు ఎంత కెపాసిటీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది, ఇతర వివరాలను అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ డైరెక్టర్ జయప్రకాష్ దేవరాజ్ ను వారు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కోవిడ్ బారిన పడుతున్నారో వారిని రక్షించుకునేందుకు, వారిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేస్తూ ఎక్కడికక్కడ కోవిడ్ బారిన పడిన వారికి నాణ్యమైన చికిత్స అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరి ప్రాణం పోకూడదని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ సోకిన వారికి ఖర్చుకు వెనకాడకుండా చికిత్స అందించాలని రాష్ట్ర యంత్రాంగానికి, జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. తాడిపత్రి ప్రాంతంలో అత్యధికంగా ఆక్సిజన్ అందుబాటులో ఉన్న అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 పడకలతో వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తే కోవిడ్ సోకిన వారికి ఎంతో ఉపయోగపడుతుందని భావించి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు కలిసి గత రెండు రోజులుగా పడకల ఏర్పాటుకు నిమగ్నమయ్యారన్నారు. అందులో భాగంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వారితో మాట్లాడి ఆక్సిజన్ పడకల కోసం అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేయాలని కోరడం జరిగిందన్నారు. అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి ఆక్సిజన్ తరలింపునకు ఇబ్బందులు ఉండడంతో ఫ్యాక్టరీకి దగ్గర్లోనే 500 పడకలతో తాత్కాలిక ఆస్పత్రి నిర్మించడం భావించి ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకొని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడే 5, 6 ఎకరాల్లో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ పడకల కోసం అవసరమైన ఆక్సిజన్ ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటూ షెడ్ల నిర్మాణం చేసి ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ సోకిన వారికి సరైన వైద్యం అందించాలనే ఆలోచనతోనే తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటుకు తామంతా ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంతో చొరవ తీసుకుని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందన్నారు. తాత్కాలిక ఆసుపత్రి పనులు ప్రారంభించేందుకు ఒకటి, రెండు రోజుల్లో అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తాడిపత్రి ప్రాంతంలో 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడంవల్ల అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కరోనా సోకిన వారికి మంచి వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాలకు లక్ష్యాలను నిర్దేశించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటును ప్రతిఘటన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా సోకిన వారికి ఆక్సిజన్ అందించేందుకు ముందుకు వచ్చిన అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఆక్సిజన్ పడకలతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం వల్ల కరోనా బాధితులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆక్సిజన్ ను ఇతర ప్రాంతాలకు తీసుకుపోయే పరిస్థితులు లేకపోవడం వల్ల ఇక్కడ ఆసుపత్రిని ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ కోవిడ్ సోకిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు వీలుగా తాడిపత్రి పరిధిలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం అవసరమైన భూమిని పరిశీలించేందుకు ఈరోజు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు. తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాన్ని చూసి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఫైనలైజ్ చేయడం జరిగిందని, అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న చర్చికి సంబంధించిన స్థలంలో ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు చర్చికి సంబంధించిన వారు కూడా సహృదయంతో ముందుకు వచ్చారన్నారు. త్వరలోనే ఇక్కడ తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామని, కరోనా సోకిన వారికి మంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు చర్చికి సంబంధించిన ఫాస్టర్ ఫాదర్ డేవిడ్ అర్లప్ప, చర్చి స్కూల్ హెడ్ సెలీనా సిస్టర్ లతో మాట్లాడి తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని చర్చించారు. సందర్భంగా చర్చికి చెందిన ఫాస్టర్, చర్చి స్కూల్ హెడ్ లు తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటుకు స్థలం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకు తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గుణ భూషణ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం అజయ్ కుమార్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ వర కుమార్, తహసిల్దార్ నాగభూషణ, ఏపీ ఎమ్ ఎస్ఐ డి సి ఈఈ రాజగోపాల్ రెడ్డి, ఐనొక్స్ గ్యాస్ ప్లాంట్ ఇంచార్జి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.