కరోనా బాధితులు సోషల్ మీడియాలో వచ్చే అనేక రకాలైన సందేశాలను నమ్మి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా వుండాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం అందించే నిమిత్తం మూడు రకాలుగా వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇంటివద్దే ఉంటూ కోవిడ్ చికిత్స పొందే వారికి ఫోన్ ద్వారా, ఆరోగ్య కార్యకర్తల ద్వారా వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ, హోం ఐసోలేషన్ కిట్లు అందించి తగిన వైద్య సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంటివద్ద వుండేందుకు తగని వసతులు లేనివారికి కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అక్కడ ఐసోలేషన్‌లో వుంటూ కోవిడ్ నుంచి కోలుకొనేందుకు తగిన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ కు గురై తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.
కోవిడ్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అవసరమైన రెమ్ డెసివర్ ఔషధాలు, ఆక్సిజన్ తగినంతగా అందుబాటులో వుండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆక్సిజన్, కోవిడ్ ఔషధాల సరఫరాపై సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నమ్మవద్దని కలెక్టర్ కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వస్తున్న ఇటువంటి సందేశాలను చదివి ఆందోళనకు గురికావద్దని సూచించారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగం చేసిన అధికారికంగా చేసే ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని కోరారు.