పేదల గృహనిర్మాణానికి రూపొందించిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలని జాయింట్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో శనివారం వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల గృహనిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తోందన్నారు. దీనిలో భాగంగా జూన్ 1 నుంచి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు. దీనికి అవసరమైన మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 846 లేఅవుట్లను రూపొందించడం జరిగిందన్నారు. వీటిలో సుమారు 294 లే అవుట్లలో ఇప్పటికే బోర్లు తవ్వకం పూర్తి అయ్యిందని చెప్పారు. మిగిలిన లేఅవుట్లలో కూడా ఈనెల 25 నాటికే బోర్లు వేయడం పూర్తి చేసి, విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గృహనిర్మాణశాఖ పిడి ఎస్‌వి రమణమూర్తి, పంచాయితీరాజ్ ఎస్ఇ జిఎస్ఆర్ గుప్త, ఇఇ కృష్ణారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ పప్పు రవి, ట్రాన్స్‌కో ఎస్ఇ వై.విష్ణు తదితరులు పాల్గొన్నారు.