కరోనాని తరమాలంటే మాస్కుధారనే ముఖ్యం..


Ens Balu
2
Anantapur
2021-05-08 13:05:52

కరోనాను కట్టడి చేయడంలో మాస్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా చారిత్రక కట్టడమైన టవర్ క్లాక్ కు మాస్కు కట్టి కరోనాను ఎదుర్కోవడంలో మాస్కు అవసరాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టవర్ క్లాక్ ఎలా అయితే జిల్లా చరిత్రలో ఒక భాగమైందో అదే విధంగా మాస్కు కూడా మన జీవితాల్లో భాగం అయినప్పుడే కరోనాను ఎదుర్కోగలమన్నారు. గతంలో ఇదే టవర్ క్లాక్ వద్ద 'మాస్కే కవచం' అనే కార్యక్రమం నిర్వహించామని, మాస్కు కేవలం కవచం మాత్రమే కాదని, కరోనాపై పోరాటంలో ఆయుధం కూడా  అన్నారు. కరోనాకు మనకు అడ్డుగోడ మాస్కు మాత్రమేనన్నారు. కరోనాకు మనం అందరం దూరంగా ఉండగలిగితే కోవిడ్ పై సగం విజయం సాధించినట్టేనన్నారు. ప్రజలంతా కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ, నిరంతరం మాస్కు ధరిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోవిడ్ సమయంలో మాస్కుల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టిన సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ ను అభినందించారు. సామాజిక కార్యకర్తలు కోవిడ్ పోరాటంలో భాగస్వాములవడం అభినందనీయమన్నారు. 

అనంతపురము నగర మేయర్ వసీం సలీం మాట్లాడుతూ రోజు రోజుకూ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు రేపు వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేయాలని పిలుపునిచ్చారు. రేపు ఆదివారం చికెన్ షాపుల వద్ద ప్రజలు ఎక్కువ గుమిగూడే అవకాశం ఉందని, చికెన్ షాపులు మూసివేయాలని నగర కమిషనర్ పీవీవీఎస్ మూర్తి విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి నగరంలోని బాలుర జూనియర్ కళాశాలలో కూరగాయల మార్కెట్ నిర్వహిస్తామని, ప్రజలంతా కర్ఫ్యూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మార్కెట్ లో కొనుగోలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

 కార్యక్రమంలో నగర డిఎస్పి వీర రాఘవ రెడ్డి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి, కార్పొరేటర్లు గూడూరు మల్లికార్జున శేఖర్ బాబు సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు