కరోనా కట్టడికి జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పామిడి మండలం జి.కొట్టాల గ్రామానికి చెందిన అంజి పామిడి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 'పాయే.. పాయే' అంటూ రాసిన పాట సిడిని జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా నివారణకు అవకాశం ఉంటుందన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కలిగేందుకు 'పాయే.. పాయే' పాట ఎంతో దోహదపడుతుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాయలసీమ, అనంతపురం జిల్లా యాసలో పాట రాయడం చాలా బాగుందన్నారు. కరోనాపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగేందుకు పాట దోహదపడుతుందని, పాటలో సంగీతం, భాష ఎంతో బాగుందన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు అవగాహన కల్పించేలా పాట రాయడం పట్ల లిరిక్స్, మ్యూజిక్, సింగర్ అయిన అంజి పామిడిని జిల్లా కలెక్టర్ అభినందించారు. కరోనాపై అవగాహన కలిగేలా పాటలు రాసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అంజి పామిడి మాట్లాడుతూ శనివారం రాత్రి 7 గంటలకు మధుర ఆడియో ద్వారా 'పాయే.. పాయే' అంటూ సాగిన పాట యూ టూబ్ లో విడుదలవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనలతో కరోనా పై అవగాహన కలిగించేలా పాట రాశానని తెలిపారు.