సింహాచల అప్పన్న తుమ్మెదల రూపంలో అలనాడు తురుష్కులను తరిమికొట్టారని పురాణాలు చెబుతున్నాయని స్థానాచార్యులు డాక్టర్ టీపీ రాజగోపాల్ జివిఎంసీ మేయర్ గొలగాని వెంటక హరి కుమారి దంపతులకు వివరించారు. ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ పేరుతను తుమ్మెదల మెట్టగా మార్చాలని మేయర్ ను కోరారు. ఆదివారం సింహాచలం దేవస్ధానంలో స్వామివారిని మేయర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సింహాచల మహత్యాన్ని మేయర్ వివరించారు. 18వ శతాబ్దం తొలిభాగంలో తురుష్కులు హిందూ దేవాలయాలపై దాడి చేసిన సందర్భంలో సింహాచలం ఆలయంపైనా దాడికి వచ్చారని.. ఆ సమయంలో నిధుల కోసం దేవాలయంలోకి ప్రవేశించి శిల్పకళలను ధ్వంసం చేశారని అన్నారు. నాటి ఆ ఆనవాళ్లును మేయర్ చూపించారు. చివరికి స్వామివారు తనను తాను కాపాడుకోవడానికి భారీ తుమ్మెదల రూపంలో బయలు దేరి తురుష్కుల మూకను తుమ్మెదల మెట్ట (ప్రస్తుతం కాన్వెంటు కూడలి)వరకూ తరిమి కొట్టారని ఆలయచరిత్ర చెబుతోందని వివరించారు. నిన్న మొన్నటివరకు ప్రస్తుత కాన్వెంట్ కూడలిని దుమ్మెదల మెట్టని పిలిచేవారని గుర్తు చేశారు. అయితే కాల క్రమేణా ఆ పేరు పోయి కాన్వెంట్ జంక్షన్ అని పిలుస్తున్నారని గుర్తు చేశారు. ఎంతో చరిత్ర వున్న కాన్వెంట్ జంక్షన్ ను... తుమ్మెదల మెట్టగా నామకరణం చేసి... అక్కడ స్వామివారి జ్ఞాపకార్థం బోర్డులు ఏర్పాటు చేయాలని ఆచార్యులు కోరారు. ఆ ప్రాంత విశిష్టత, స్వామివారి మహత్యం ఇప్పటి యువతకు చెప్పాలని స్థానాచార్యులు కోరగా... ఈ దిశగా తీర్మానం చేసేందుకు ప్రయత్నిస్తామని మేయర్ హామీనిచ్చారు.