ప్రాధాన్యతా క్రమంలో టోకెన్లు తీసుకున్నవారందరికీ కోవిడ్ వేక్సినేషన్ ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం కాకినాడలోని ఆనందభారతి స్కూల్, తిలక్ స్కూల్‌లోని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ప్రస్తుతం కోవిడ్ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో వైరస్ ఒకరినుంచి మరొకరికి వ్యాపించకుండా టీకా కేంద్రాల వద్ద చేసిన ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించారు. అదే విధంగా వేసవి నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. టీకా కేంద్రాల్లోని రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్ గదులను పరిశీలించి, అక్కడికి వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల ద్వారా అందించే టోకెన్ల ఆధారంగా లబ్ధిదారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. కోవిడ్ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో లబ్ధిదారులు, సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఏ టీకా అందుబాటులోఉంది? ఎవరికి పంపిణీ చేస్తున్నారు? ఎన్నో డోసు వేస్తున్నారు? టీకా పంపిణీ సమయం? తదితర వివరాలను వ్యాక్సినేషన్ కేంద్రాల ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులో ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. కలెక్టర్ వెంట కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వ్యాక్సిన్ కేంద్రం ప్రత్యేక అధికారులు, సిబ్బంది ఉన్నారు.