మే నెలంతా రెండో డోసు మాత్రమే వేస్తాం..
Ens Balu
1
Vizianagaram
2021-05-09 07:36:30
విజయనగరం జిల్లాలో ఈ నెల 10 నుండి 31వ తేదీ వరకు అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రెండో డోసు వారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ వేస్తారని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వెల్లడించారు. మే నెలలో 10 నుండి నెలాఖరు వరకు మొదటి డోసు వ్యాక్సిన్ వేయరని తెలిపారు. ఇందు కోసం ఆన్ లైన్‌లో బుక్ చేసుకునేందుకు కూడా అవకాశం లేదని తెలిపారు. జూన్ మొదటి వారం నుండి మాత్రమే మొదటి డోసు వ్యాక్సినేషన్ మళ్లీ చేపడతారని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. మొదటి డోసు వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న స్లాట్‌లు రద్దవుతాయని స్పష్టంచేశారు. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవలసి వున్న వారందరికీ వారు రెండో డోసు వ్యాక్సిన్ ఏ కేంద్రంలో ఏ తేదీన వేసుకోవాలో వారి మొబైల్ ఫోన్లకు సందేశం పంపించడం లేదా ఫోన్ చేసి తెలియజేస్తారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వృధాను నివారించడంలో భాగంగా కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే రెండో డోసు వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ఆయా కేంద్రంలో ఎంత మందికి వాక్సిన్ వేయాలో, ఏ ప్రాంతం వారికి వేయాలో సంబంధిత జాబితా కూడా నిర్దేశిస్తారని ఆ మేరకు మాత్రమే వేస్తారని పేర్కొన్నారు. కేవలం రెండో డోసు వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వాటిని పరిగణించి రెండో డోసు వ్యాక్సిన్ అవసరమైన వారికే ఆయా కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ఇకపై వ్యాక్సిన్ ను ఆరోగ్య కేంద్రానికి సమీపంలోని విశాలమైన ప్రదేశంలో స్కూలు, కళాశాల ప్రాంగణాల్లో చేపడతారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయాల్సిన వారందరినీ గదుల్లో కోవిడ్ నిబంధనల మేరకు భౌతిక దూరాన్ని పాటించి కూర్చోబెట్టి ఆరోగ్య కార్యకర్తలు వారి దగ్గరకు వెళ్లి వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవలసిన వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి గడువులోగానే రెండో డోసు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. పట్టణాల్లోని అర్బన్ ఆరోగ్య కేంద్రాల వద్ద ఏర్పాటుచేసే వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సంబంధిత మునిసిపల్ కమిషనర్లు వ్యాక్సిన్ వేసుకునే వారికి నీడలో కూర్చొనే సదుపాయాలు, ఆయా కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం, క్యూ లైన్ల నిర్వహణకు తగిన స్థాయిలో పోలీసు రక్షణ కల్పిస్తూ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.