కోవిడ్ వినతులకు తక్షణ పరిష్కారం..


Ens Balu
2
కలెక్టరేట్
2021-05-10 14:20:33

విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం కోవిడ్ పై ప్రత్యేకంగా నిర్వహించిన టెలి స్పందన కు 24 ఫోన్ కాల్స్ వచ్చాయి.   జిల్లా కలెక్టర్  డా. ఎం. హరి జవహర్ లాల్ స్వయంగా కాల్స్ అందుకొని ప్రజల సమస్యల పై  సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధానంగా  వాక్సినేషన్ కోసం ఎక్కువ మంది సమస్యలను విన్నవించారు.  మండలం లో నున్న అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలోను వాక్సినేషన్ వేసేలా చూడాలని, మండలం లో  ఎక్కడో ఒకే చోట వేయడం వలన వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని , తీరా వెళ్ళిన తర్వాత అక్కడ వాక్సిన్ అందుబాటులో లేకపోతే కష్టం అవుతుందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.  రెండవ డోస్ వేయవలసిన వారికి ముందుగా వేయాలని కొందరు కోరగా మొదటి డోస్  కూడా త్వరగా వేయాలని మరి కొందరు  కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మండలాల్లో నున్న అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్సిన్ వేసే ఏర్పాట్లను చూడాలని, మొదటి డోస్ వేసుకున్న 5 నుండి 6 వారాలు పూర్తి అయిన వారికీ రెండవ డోస్ వేయడం లో ప్రాధాన్యత నివ్వాలని ఆ మేరకు ఆదేశాలు జారి చేయమని   సంయుక్త కలెక్టర్ డా. మహేష్  కుమార్ కు  సూచించారు.  అదే విధంగా మొదటి డోస్ కావాలని కోరిన వారికీ సమాధానం చెప్తూ ప్రభుత్వానికి విన్నవిస్తామని అన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారంగానే వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో  కోవిడ్ సేవలు బాగానే అందుతున్నప్పటికి ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ జరుగుతోందని, డబ్బులు ఎక్కువుగా వసూలు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేసారు.  కలెక్టర్ స్పందిస్తూ ప్రతి ఆసుపత్రికి ఒక నోడల్ అధికారిని వేయడం జరిగిందని, వారు స్పందించకుంటే సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్ కు ఫోన్ చెయ్యవచ్చని తెలిపారు.  ప్రైవేటు ఆసుపత్రుల పై నోడల్ అధికారులు పర్యవేక్షణ సక్రమంగా ఉండేలా చూడాలని  జే.సి కు సూచించారు.  కొన్ని వార్డులలో  పారిశుధ్యం  మెరుగ్గా లేదని ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమీషనర్ల   తో వెంటనే ఫోన్ లో మాట్లాడి   పారిశుధ్యం పై ప్రత్యెక దృష్టి పెట్టేలా ఆదేశాలు జారి చేసారు. పారిశుద్ద్యం పై ఒక ప్రత్యెక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షించాల్సి  ఉందని, వెంటనే టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలనీ  డి. ఆర్.ఓ కు సూచించారు.  కోవిడ్ పరీక్షలు జరుగుతున్నప్పటికీ ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని కొంత మంది కాలర్స్ తెలుపగా, పరీక్షల ఇంచార్జ్  డా. గోపాల కృష్ణ తో మాట్లాడి  ఫలితాల వెల్లడి లో ఆలస్యం కాకుండా చూడాలని, 24 గంటల్లోగా తెలపాలని సూచించారు. ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ బాగుందని,  దీనిని ఇంకా కొంత కాలం  కొనసాగించాలని  కొంత మంది  కోరగా, 12  గంటల వరకు సమయం ఇవ్వడం లేదని, ముందే బంద్ చేయిస్తున్నారని ,   12 వరకు గడువు ఇచ్చేలా చూడాలని   లంకా పట్నం నుండి రైతు బజార్ వర్తకులు కోరగా  మున్సిపల్ కమీషనర్ కు ఫోన్ ద్వారా మాట్లాడి వారి 12 గంటల వరకు గడువు ఇచ్చేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.           ఈ టెలి స్పందన లో  జిల్లా కోవిడ్ ప్రత్యేకాధికారి సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్ , సబ్ కలెక్టర్ విధే ఖరే,  జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు తదితరులు పాల్గొన్నారు.  

సిఫార్సు