మాస్క్ లేకపోతే ఉద్యోగులకూ అనుమతిలేదు..
Ens Balu
1
విజయనగరం
2021-05-10 14:22:04
ప్రభుత్వ ఉద్యోగులంతా తమ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యేటపుడు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించడం, శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవడం, సీట్ల మధ్య భౌతికదూరం వుండేలా చూడటం వంటి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యాలయాల్లోకి మాస్క్ ధరించని వారికి ప్రవేశం కల్పించరాదని, మాస్క్ లేని వారికి ప్రవేశం లేదనే బోర్డులు కూడా ప్రతి కార్యాలయం వెలుపల ప్రదర్శించాలన్నారు. జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు కోవిడ్ బారిన పడుతున్న దృష్ట్యా ఆయా కార్యాలయాల్లో కరోనా అప్రమత్తత విషయంలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించే నిమిత్తం జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ లోని విద్యా శాఖ, ట్రజరీ, రెవిన్యూ తదితర కార్యాలయాల్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఉద్యోగులు శానిటైజర్లు వాడుతున్నదీ లేనిదీ పరిశీలించారు. భౌతిక దూరం పాటిస్తూ ఉద్యోగులు సీటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు. కోవిడ్ దృష్ట్యా బయో మెట్రిక్ హాజరును సస్పెండ్ చేశామని, సమావేశాలకు ప్రత్యక్షంగా పిలవకుండా టెలికాన్ఫరెన్సులు, వెబ్ కాన్ఫరెన్సులు నిర్వహించాలని ఆదేశాలిచ్చామన్నారు. దివ్యాంగులు, గర్భిణీలైన ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పనిచేయకుండా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. కోవిడ్ రెండో వేవ్ తీవ్రత దృష్ట్యా ఉద్యోగులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ఆరోగ్య రక్షణ విషయంలో శ్రద్ధ చూపాలని కోరారు. ఈ పర్యటనలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు కూడా పాల్గొన్నారు.