అనంతకు నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ లు..


Ens Balu
0
కలెక్టరేట్
2021-05-10 14:32:55

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు 4 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లను మంజూరు చేశారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. సోమవారం హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు పనులను, ఆక్సిజన్ ప్లాంట్ ను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ నిషా0తి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కెపాసిటీకి సంబంధించి ఒక నిముషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. దాని ద్వారా ఒక రోజులో దాదాపు 190 సిలిండర్ ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి ఒక నిముషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సరిపోతుందని ఇక్కడ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగిందన్నారు. హిందూపురం తోపాటు జిల్లాలోని అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కదిరి, గుంతకల్లు ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు అదనంగా టిఎస్ఏ టెక్నాలజీ ద్వారా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కు సంబంధించి సివిల్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సివిల్ పనులు జరుగుతున్నాయని, 4 రోజుల్లో సివిల్ పనులు పూర్తి చేసి బయట ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడకుండా స్వంతంగా ఇక్కడే ప్లాంట్ పెట్టుకుని గాలిలో ఉన్న నీటిని తీసుకుని ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఆక్సిజన్ సరఫరా కు కావాల్సిన ఆక్సిజన్ జనరేషన్ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లో ఏర్పాటు చేసే మిషనరీ డిఆర్డీఓ ( డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) నుంచి వస్తుందని, వారితో కూడా సమన్వయం చేసుకుంటున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా మిషనరీ వచ్చేలా చేసి ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేసేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్

ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జిల్లాకు 4 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లను మంజూరు చేశారని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, డిఆర్డీఓ సమన్వయంతో ప్లాంట్ లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తారన్నారు. దీని ద్వారా పేషంట్ లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ సరఫరా చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం చాలా సంతోషమన్నారు. హిందూపురం ఆస్పత్రికి వచ్చి కరోనా చికిత్స తీసుకునే వారు ఎవరు అభద్రతా భావానికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేసిందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం కంకణబద్ధులై ముందుకు వెళుతోందన్నారు. అందరూ కలిసికట్టుగా కరోనాని జయించాలన్నారు. ప్రజలెవరూ భయబ్రాంతులకు గురి కారాదని, కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం అజయ్ కుమార్, నోడల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

సిఫార్సు