రేపటి నుంచి కరోనా టీకా కార్యక్రమం..


Ens Balu
1
Srikakulam
2021-05-10 15:00:34

శ్రీకాకుళం జిల్లాలో టీకా కార్యక్రమాన్ని మంగళవారం నుండి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, వైద్య శాఖ అధికారులతో సోమవారం టెలికాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్త రాదని ఆదేశించారు. ఒక నిర్దిష్ట సమయంలో వంద మందికి మాత్రమే టీకా ఇవ్వాలని, ఆ మేరకు ఆ వంద మందికి ముందు రోజు సాయంత్రం నాటికి సమాచారం చేరవేయాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత వంద మంది మినహా ఎవరికీ టీకా వేయరాదని ఆయన స్పష్టం చేశారు. సమాచారం లేకుండా షెడ్యూలులో లేకుండా వచ్చిన వారికి ఎవ్వరికీ టీకా ఇవ్వరాదని ఆదేశించారు. టీకా కేంద్రం స్పష్టంగా తెలియజేసి, టీకాకు వచ్చిన వారికి కుర్చీలు ఏర్పాటు చేయాలని, గదులలో కూర్చోబెట్టాలని ఆయన పేర్కొన్నారు. కూర్చున్న చోటనే టీకా వేసి పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించాలని, హోమ్ ఐసోలేషన్ వ్యవస్థను పర్యవేక్షించాలని ఆయన అన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడికల్ కిట్లు అందాలని ఆయన పేర్కొంటూ సకాలంలో మెడికల్ కిట్లు అందించడం వల్ల ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉండదని అన్నారు. ఇంటి వద్దనే పూర్తిస్థాయిలో నయం చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ లో అందరూ చక్కని పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. పాజిటివ్ కేసులు గుర్తింపు పూర్తి స్థాయిలో ఉండాలని తద్వారా జిల్లా లో కోవిడ్ నియంత్రణకు సులభం అవుతుందని అన్నారు. ఏఎన్ఎంలు యాప్ లో వివరాలను అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు.  ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సిహెచ్. శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు