కోవిడ్ పరీక్షల సామర్ధ్యం పెంపు..


Ens Balu
2
Kakinada
2021-05-10 15:45:06

 కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచే విధంగా నూతన యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టిపిసిఆర్ (RT PCR రియల్ టైమ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) యంత్రాన్ని జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి తో కలిసి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం టీబీ బ్లాక్ లో నూతనంగా  ఏర్పాటుచేసిన 80 ఆక్సిజన్ పడకలను కలెక్టర్, జేసి, వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు.
    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో రోజువారి కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచే విధంగా ఆర్టి పిసిఆర్ యంత్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ యంత్ర సహాయంతో రోజుకు 6వేలు శాంపిల్స్ ను పరీక్షించేందుకు వీలుంటుందని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా రాజమహేంద్రవరం ఆసుపత్రికి సంబంధించి మరోక యంత్రం ఏర్పాటుకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని దీనితో జిల్లాలో రోజుకు సుమారుగా 8వేలు ఆర్టి పిసిఆర్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా జిల్లాలో ఆక్సిజన్ లభ్యత అనుగుణంగా పడకల సంఖ్యను కూడా పెంచడం జరుగుతుందన్నారు. జిల్లాలో కోవిడ్ వైద్య సేవలకు సంబంధించి  పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కి సంబంధించి పూర్తిస్థాయిలో కోవిడ్ కేసుల పర్యవేక్షణకు గాను నూతనంగా రాష్ట్ర కమాండ్ కంట్రోల్  రూమ్ నుంచి నూతన ట్రైనీ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చాంద్ ను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. జిజిహెచ్ టీబీ బ్లాక్ లో జరిగే కోవిడ్ పరీక్షల కేంద్రాన్ని బాలాజీ చెరువు వద్ద ఉన్న పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కి మార్చడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
   ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. పి వెంకటబుద్ధ, ఆర్ఎమ్ఓ  గిరిధర్, జిజిహెచ్ నోడల్ అధికారి ఎం భానుప్రకాష్, ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు