శివం ఫౌండేషన్ సేవలు అభినందనీయం..


Ens Balu
1
PRAKASAM
2021-05-11 12:58:37

కరోనా బాధితులను ఆదుకునేలా శివం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు  అభినందనీయమని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ కొనియాడారు. దర్శి మాజీ శాసన సభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి ద్వితియ వర్థంతి సందర్భంగా శివం ఫౌండేషన్ చీమకుర్తి వారు రిమ్స్ ఆసుపత్రికి 25 ఆక్సిజన్ సిలిండర్లను కలెక్టర్ చేతులమీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములుకు మంగళవారం అందజేశారు. ప్రకాశం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ కరోనా బాధితుల కోసం రిమ్స్‌లో మరో 80 పడకలు తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ చికిత్స పొందుతున్న వారికి ఈ ఆక్సిజన్ సిలిండర్లను వినియోగిస్తామని చెప్పారు. శివం ఫౌండేషన్ సేవలను స్ఫూర్తిగా తీసుకొని కోవిడ్ బాధితులకు ఉపయోగపడేలా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మంచాలు, పరుపులను అందించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఆర్థిక పరంగా సహాయం చేయాలనుకునేవారు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి హరి మాట్లాడుతూ సమాజ సేవే సర్వేశ్వరుని సేవగా భావించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రిమ్స్‌లో కోవిడ్ బాధితులకు ఉపయోగపడేలా మూడు లక్షల రూపాయల విలువైన ఈ ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్థి) టి.ఎస్. చేతన్,
డి.ఎమ్.హెచ్.ఓ. రత్నావళి, రిమ్స్ డిప్యూటి సూపరింటెండెంట్ మురళీకృష్ణారెడ్డి,
ఏ.పి.ఎమ్.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి కుమార్, ఇతర అధికారులు, శివం ఫౌండేషన్
ప్రతినిధులు పాల్గొన్నారు.
సిఫార్సు