రాష్ట్రప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా అందిస్తున్న కోవిడ్ రెండో డోసు వేక్సిన్ మొదటి వేక్సిన్ తీసుకున్నవారంతా వేయించుకోవాలని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి కోరారు. మంగళవారం 2వ జోను పరిధిలోని 11వ వార్డులో పలు ప్రాంతాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరిలోవలోని ఎఫ్.ఆర్.యు. ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో చెత్త లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు ఆ ప్రదేశాన్ని శానిటేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాత ఆరిలోవ, డ్రైవర్సు కోలనీ, అన్నానగర్, తోటగరువు, గాంధీ నగర్, రవీంద్ర నగర్ తదితర ప్రాంతాలలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రితో కలసి పర్యటించి, ఆయా ప్రాంతాలలో జరుగుచున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. తడి చెత్త-పొడి చెత్త సేకరించే విధానాన్ని పరిశీలించారు. ప్రజల నుండి తడి–పొడి చెత్త వేరు వేరుగా తీసుకోవాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. గాంధీనగర్ లోని గెడ్డ నందు పూడిక తీయించాలని, రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు డంపింగు యార్డుకు తరలించాలని శానిటరి ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది ప్రతీ రోజూ కాలువలు, రోడ్లను శుభ్రం చేస్తున్నదీ లేనిదీ ఆరాతీసారు. తడి–పొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని ప్రజలకు సూచించారు. ఆయా ప్రాంతాలలో వెలగని వీధి లైట్లను యుద్ధ ప్రాతిపదికన మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వార్డులో ప్రధాన వీధులలో “బెల్ మిస్టర్” మిషన్ ద్వారా సోడియం హైపోక్లోరైట్ చల్లే ప్రక్రియను ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రితో కలసి పరిశీలించారు. ఈ పర్యటనలో జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బయోలజిస్టు, శానిటరి ఇన్ స్పెక్టర్, వార్డు శానిటరి కార్యదర్శులు, శానిటరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.