కోవిడ్ పాజిటివిటీ తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని.. ఈ సరళిని మున్ముందు కొనసాగేందుకు, రాజీ లేకుండా టెస్టింగ్, పడకల సంఖ్య, ఆక్సిజన్ సరఫరా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న డోసులను బట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ మురళీధర్‌రెడ్డి కోవిడ్ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధతపై మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు 4,500 వరకు ఉన్న ఆర్‌టీపీసీఆర్ రోజువారీ సామర్థ్యాన్ని 7,500 వరకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, కోవిడ్ లక్షణాలున్న వారికి మాత్రమే ఫోకస్డ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ లభ్యత, నిష్ణాతులైన వైద్యులు, ఇతర సిబ్బంది లభ్యతను బట్టి నెమ్మదిగా ఆక్సిజన్ పడకల సంఖ్యను క్రమంగా పెంచుతున్నామని, రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు అనుసంధానంగా 300-400 ఆక్సిజన్ పడకలతో చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వెల్లడించారు. పేపర్‌మిల్లులో పునరుద్ధరించిన యూనిట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న 15 కేఎల్ ఆక్సిజన్‌ను ఈ చికిత్సా కేంద్రానికి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పెద్దాపురంలోనూ ఓ యూనిట్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇది అందుబాటులోకి వస్తే రోజుకు 480 సిలిండర్ల మేర ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్‌పై ఎలాంటి అపోహలు అవసరం లేదని, కేంద్రం నుంచి అందుతున్న డోసుల మేరకు జిల్లాలో శాశ్వత కేంద్రాల ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండో డోసు ఎక్కువ రోజులు పెండింగ్ ఉన్నవారికి తొలుత ప్రాధాన్యమివ్వనున్నామని, వాలంటీర్ల ద్వారా టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ టోకెన్లు లేకుండా ఎవరూ వ్యాక్సిన్ కేంద్రాలకు రావొద్దని సూచించారు. రెండో డోసు పెండింగ్ ఉన్నవారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే మొదటి డోసు పంపీణీ ఉంటుందని స్పష్టం చేశారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లను రోగికి ఇచ్చేందుకు స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉందని, దాని ప్రకారం మాత్రమే ఈ ఔషధం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. బయట జరిగే అవాస్తవ ప్రచారాలను నమ్మి, అనవసరంగా ఇంజెక్షన్ కోసం వెంపర్లాడటం మంచిది కాదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని, జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. వివిధ కారణాల వల్ల బయట నుంచి ట్యాంకుల ద్వారా ఆక్సిజన్ సరఫరాకు అవాంతరం ఏర్పడిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితిలో వినియోగించుకునేందుకు జీజీహెచ్ కాకినాడ, జీహెచ్ రాజమహేంద్రవరంలో మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. కోవిడ్ చికిత్స కోసం గుర్తింపులేని ఆసుపత్రుల్లో చేరొద్దని ప్రజలకు కలెక్టర్ సూచించారు. మీడియా ప్రజలకు వాస్తవాలు వివరించి అవగాహన, అప్రమత్తలతో విపత్తును ధైర్యంగా ఎదుర్కోనేలా సమాయత్త పరచాలని, భయాందోళనలు కల్పించ కూడదని కోరారు.