అవసరం మేరకు ఆక్సిజన్ నిల్వలు..
Ens Balu
2
Kakinada
2021-05-11 14:20:08
తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం రోజువారీ మెడికల్ ఆక్సిజన్ వినియోగం 42-45 కిలో లీటర్లు కాగా.. 85 కిలో లీటర్ల మేరకు నిల్వలు ఉన్నట్లు జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ తెలిపారు. మంగళవారం జెసి వర్చువల్ విధానంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాకు ఒడిశా, విశాఖపట్నం నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోందని, ఈ ఆక్సిజన్ రీఫిల్లింగ్ ప్రక్రియతో పాటు ఆసుపత్రులకు సరఫరా చేయడం, సక్రమంగా వినియోగించేలా చూసేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆక్సిజన్‌కు కొరత ఉందనే మాట రాకుండా చూస్తున్నామని, ఇదే సమయంలో ఆసుపత్రులు ఆక్సిజన్ వృథా కాకుండా చూడాల్సిన అవసరముందన్నారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాలు సమన్వయంతో పనిచేస్తూ రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం 16,337 టన్నుల మేర కొనుగోలు చేయగా, మంగళవారం దాదాపు 19 వేల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు తెలిపారు. బోండాలు రకం ధాన్యం కొనుగోలులో ఎక్కడా సమస్యలు లేవని, ఏవైనా సందేహాలు ఉంటే ఆర్‌బీకేలోని ధాన్యం కొనుగోలు సహాయకుడిని సంప్రదించాలని సూచించారు. ఖరీఫ్ సన్నద్ధతలో భాగంగా వారం రోజుల పాటు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అడ్వయిజరీ కమిటీల సమావేశాలు నిర్వహించనున్నామని తెలిపారు. విత్తనాలు, ఎరువులను అవసరం మేరకు ఆర్‌బీకేల వద్ద అందుబాటులో ఉంచనున్నట్లు జేసీ డా. జి.లక్ష్మీశ వెల్లడించారు.