కోవిడ్ బాధితులకు మెరుగైన సేవలు..
Ens Balu
0
East Godavari
2021-05-11 14:29:01
ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ కోవిడ్ బాధితులకు మెరుగైన సేవలందించ గలుగుతున్నామని, మరణాల రేటును గణనీయంగా కట్టడి చేయగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కోవిడ్ రెండో దశ నివారణ, నియంత్రణ, బాధితులకు వైద్య సహాయం, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు; గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు తదితరాలకు శాశ్వత భవన నిర్మాణాలు; ఖరీఫ్ సన్నద్ధత తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 104 కాల్ సెంటర్ వ్యవస్థ చాలా కీలకమైందని, వచ్చే ప్రతి కాల్‌కూ సంతృప్తికర స్థాయిలో సమాధానమిచ్చి, వీలైనంత త్వరగా సేవలు అందేలా చూడాలన్నారు. కోవిడ్ వైరస్ తీవ్రత అధికంగా ఉన్నవారిని రక్షించేందుకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్‌ను తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది పాయింట్ల నుంచి తీసుకొస్తున్నామని, వేగంగా ఆక్సిజన్‌ను తీసుకొచ్చేందుకు ఖాళీ ట్యాంకర్లను విమానాల్లో పంపుతున్నామని వెల్లడించారు. 15 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను బుక్ చేశామని, ఈ నెల చివరి నుంచి వాటి డెలివరీ మొదలవుతుందని, కోవిడ్ కేర్ కేంద్రాలకు వీటిని అందించనున్నట్లు తెలిపారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేసి, ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలన్నారు. రైస్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్ కార్డు, ఇళ్ల పట్టాలకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే దరఖాస్తులను నిర్దేశ ఎస్ఎల్ఏలో పరిష్కరించేలా చూడాలన్నారు. మే 13న వైఎస్సార్ రైతు భరోసా, మే 18న మత్స్యకార భరోసా, మే 25న పంట బీమా పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమచేసే కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.